PM Modi: మోదీకి కేంద్ర కేబినెట్ ఘన సత్కారం.. ప్రత్యేక తీర్మానం ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. దేశంలో ఎన్నికైన ప్రధానమంత్రిగా వరుసగా అత్యధిక కాలం పదవిలో కొనసాగిన నాయకుడిగా ఆయన కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సభ్యులంతా నిలబడి చప్పట్లతో ఆయనను అభినందించి గౌరవం తెలిపారు. ప్రధానిగా మోదీ 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. ఎన్నికైన ప్రధానిగా ఆయన 4,399 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసి,దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల అనంతరం నెహ్రూ ప్రధానిగా కొనసాగిన కాలాన్ని ఈ పోలికకు పరిగణనలోకి తీసుకున్నారు.
వివరాలు
12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో కీలక సమావేశం
1947 నుంచి 1952 వరకు ఆయన తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. మరోవైపు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 14 ఏళ్లకు పైగా ప్రధానిగా ఉన్నప్పటికీ, ఆమె పదవీకాలం నిరంతరాయంగా సాగలేదు. అయితే 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన మోదీ, ఎలాంటి విరామం లేకుండా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన ఎన్నికైన నేతగా చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రక ఘట్టంతో పాటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం భారత్ మండపంలో జరగనున్న ఈ సమావేశంలో ప్రధాని మోదీ సాధించిన ఈ అరుదైన ఘనతపై ఎన్డీయే ప్రత్యేక తీర్మానం ఆమోదించే అవకాశముంది.
వివరాలు
మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు రాజ్‌నాథ్ సింగ్,అమిత్ షా,జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరుకానున్నారు. అలాగే ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు,కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు కూడా పాల్గొననున్నారు. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు సాకారమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనం,సెంట్రల్ విస్టా ప్రాజెక్టు,కర్తవ్య పథ్,వందే భారత్ రైళ్లు,స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఐఎన్ఎస్ విక్రాంత్,కశ్మీర్ రైల్ లింక్, గంగా ఎక్స్‌ప్రెస్‌వే వంటి కీలక నిర్మాణాలు దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపించాయి. ఎన్డీయే సమావేశంలో ఇప్పటివరకు సాధించిన విజయాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ వ్యూహాలు, రానున్న ఎన్నికల సవాళ్లపై సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం.