Shri Ram Navami: రామ్‌లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీరామనవమి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు శ్రీరాముని జయంతి సందర్భంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు! ఈ శుభ సందర్భంలో, నా హృదయం భావోద్వేగంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. శ్రీరాముని కృప వల్లే నేను ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను వీక్షించాను. ఆ క్షణాలు ఇప్పటికీ నా మదిలో శక్తిని నింపుతున్నాయి. అయోధ్య దివ్య మందిరంలో మన రామ్‌లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి రామనవమి ఇది.
రామభక్తులు, సాధువులు-మహాత్ములను స్మరించుకోవాలి: మోదీ
ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం లభించింది. ఇది దేశ ప్రజల ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితం'' అని మోదీ ఎక్స్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. భారతీయ ప్రజల హృదయాల్లో శ్రీరాముడు ఉన్నాడని ప్రధాని మోదీ అన్నారు. రామాలయ నిర్మాణం కోసం తమ జీవితాన్నంతా అంకితం చేసిన అసంఖ్యాకమైన రామభక్తులు, సాధువులు-మహాత్ములను ఈ సందర్భంగా స్మరించుకోవల్సిన అవసరం ఉంది. మర్యాద పురుషోత్తముడి జీవితం, ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన ఆధారం అవుతాయని నా పూర్తి నమ్మకం. ఆయన ఆశీస్సులు స్వయంసమృద్ధ భారత్ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని విశ్వసిస్తున్నాను. శ్రీరాముని పాదాలకు ప్రణామాలు'' అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.