PM Modi: వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుండి మంగళవారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రధాని వారణాసి నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ముందు రోజు ప్రధాని మోదీ వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించారు. మంగళవారం నామినేషన్ వేసే ముందు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థనలు చేశారు. అనంతరం కాలభైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అంతకు ముందే అయన ప్రతిపాదకులు, ఎన్‌డీఏ ముఖ్యనేతలు నామినేషన్ వేదికకు చేరుకున్నారు.
నామినేషన్ తరువాత జార్ఖండ్‌కు ప్రధాని
నామినేషన్ దాఖలు చేసే సమయంలో ప్రధాని మోదీ తో బాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ఆయన వెంట ఉన్నారు. నామినేషన్ పత్రాల దాఖలు చేసిన తరువాత ప్రధాని మోదీ జార్ఖండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. వారణాసికి బీజేపీ,ఎన్డీఏ ముఖ్యనేతలు అమిత్ షా,రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్,రాందాస్ అథవాలే, జయంత్ చౌదరి, ఓం ప్రకాష్ రాజ్‌భర్, సంజయ్ నిషాద్, అనుప్రియా పటేల్, ప్రఫుల్ పటేల్, చంద్రబాబు నాయుడు, ఏక్నాథ్ షిండే, హర్దీప్ పూరి, పవన్ కళ్యాణ్ తదితరులు చేరుకున్నారు. కాగా.. వారణాసి స్థానానికి జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి మరోసారి మోదీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.