Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
కాంగ్రెస్ (Congress) పార్టీకి ఓటు వేస్తే మీ సంపద మొత్తం గోవిందా అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజల్ని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ (Rajasthan)లో జరిగిన ఓ సభలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ప్రధాని గా చేసిన కాలంలో ఈ దేశ సంపదపై మొదటి హక్కు ముస్లిం (Muslims) లదే అని చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల సంపదను చొరబాటుదారులకు లేదా ఎక్కువ జనాభా ఉన్నవారికి పంచి పెడతారా అని ప్రశ్నించారు.
ప్రజల కష్టార్జితం వారి ఆత్మగౌరవం: ప్రధాని మోదీ
ప్రజలు బాగా కష్టపడి సంపాదించిన డబ్బును ప్రభుత్వం జప్తు చేసుకునే హక్కు ప్రభుత్వాలకు ఉందా అని మోదీ ప్రశ్నించారు. మహిళల దగ్గర ఉన్న బంగారం వివరాలన్నింటినీ సేకరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో (Manifesto)లో ఆపార్టీ పేర్కొందని మోదీ చెప్పారు. ప్రజల కష్టార్జితం, మహిళల బంగారం వారి వారి ఆత్మగౌరవంగా మోదీ అభివర్ణించారు. వారి కష్టార్జితాన్ని ప్రజలకు పంచిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రధాని మోదీ ప్రశ్నించారు. కాగా, ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముస్లింలను చొరబాటుదారులంటారా? అని కొంతమంది, మన్మోహన్ సింగ్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మరికొంతమంది విబేధిస్తున్నారు. అయితే మోదీ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో అవి లేవు: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ చెబుతున్న అంశాలేవీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేవని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మొదటిదశ ఎన్నికలు ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ బాగా నిరాశకు గురయ్యారని అన్నారు. దీంతో నరేంద్ర మోదీ మరిన్ని అబద్ధాలు మాట్లాడటం పెంచారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఓటమి భయంతో ఇప్పుడున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు నరేంద్ర మోదీ ఆడుతున్న నాటకంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు.