Page Loader
PM Modi: మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. 'గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌' వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం
మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. 'గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌' వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం

PM Modi: మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. 'గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌' వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మాస్కోలో జరగనున్న 'గ్రేట్ పేట్రియాటిక్ వార్' 80వ వార్షికోత్సవ పరేడ్‌లో ఆయన పాల్గొనే అవకాశముందని సమాచారం. ఈ విషయాన్ని రష్యా వార్తా సంస్థ టాస్‌ వెల్లడించింది.టాస్‌ ప్రకారం, మే 9న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో 'గ్రేట్ పేట్రియాటిక్ వార్' 80వ వార్షికోత్సవాన్ని జరుపనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముందని సమాచారం. భారత సైనిక దళం కూడా ఈ పరేడ్‌లో కవాతు నిర్వహించనున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, దీనిపై భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదే సందర్భంగా, వివిధ దేశాధినేతలను పరేడ్‌కు ఆహ్వానిస్తున్నట్లు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.

వివరాలు 

16వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ 

ఇదిలా ఉండగా,గతేడాది అక్టోబరులో మోదీ రష్యాలో పర్యటించారు.కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. బ్రిక్స్ సదస్సులో ప్రసంగించిన ఆయన,భారత్‌ ఎల్లప్పుడూ దౌత్యానికి, చర్చలకు మద్దతు తెలుపుతుందని, యుద్ధాన్ని వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థిక అస్థిరత, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సమస్యలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఇరుదేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు అమెరికాతో పాటు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మోదీ మాస్కో పర్యటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.