PM Modi: వారణాసిలో 'కిసాన్ సమ్మేళన్ కు వెళ్లనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 18న ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో 'కిసాన్ సమ్మేళన్'(రైతుల సదస్సు)లో ప్రసంగించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఆదివారం రికార్డు స్థాయిలో మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి. రొహనియా,సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతుల సదస్సుకు వేదికను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు స్థానిక బీజేపీ నాయకులు తెలిపారు. ప్రధాని మోదీ వారణాసి పర్యటనకు సంబంధించి గులాబ్‌బాగ్‌లోని పార్టీ కార్యాలయంలో మహానగర, జిల్లా అధికారుల సమావేశం జరిగింది. ఈ పవిత్ర పట్టణంలో ఒకరోజు పర్యటన సందర్భంగా దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతిలో ప్రధాని మోదీ పాల్గొంటారని,బీజేపీ కాశీ ప్రాంత అధ్యక్షుడు దిలీప్ పటేల్ తెలిపారు. అందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయన్నారు.
ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తల సిద్ధం
వారణాసిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని బీజేపీ కార్యకర్తలందరినీ కోరినట్లు పటేల్ తెలిపారు. రైతు సదస్సుకు పార్టీ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించే ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో, ప్రధాని మోదీ తన వారణాసి స్థానాన్ని వరుసగా మూడోసారి నిలబెట్టుకున్నారు . కాంగ్రెస్‌కు చెందిన అజయ్ రాయ్‌ను 1.5 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు.