PM Modi: వచ్చే ఆరేళ్లలో భారత ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: ప్రధాని మోదీ
వచ్చే ఆరేళ్లలో భారత్‌లో ఇంధన రంగంలో దాదాపు 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు. భారతదేశ వృద్ధిలో భాగం కావాలని ప్రపంచ పెట్టుబడిదారులను మోదీ ఆహ్వానించారు. మంగళవారం గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ రెండో ఎడిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ఇటీవల ఐఎంఎఫ్ కూడా అంచనా వేసినట్లు మోదీ గుర్తు చేశారు.
భారత ఇంధన రంగ వృద్ధిలో భాగమవ్వండి: మోదీ
త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. 2030నాటికి 254 MMTPA (సంవత్సరానికి మిలియన్ మెట్రిక్ టన్నులు) నుంచి 450 MMTPAకి రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచాలని దేశం భావిస్తోందని మోదీ పేర్కొన్నారు. భారతదేశ ఇంధన రంగ వృద్ధిలో భాగం కావాలని ఆయన ప్రపంచ కంపెనీలను మోదీ ఆహ్వానించారు. ఇంధన రంగంలో మునుపెన్నడూ లేని విధంగా భారతదేశం అపూర్వమైన పెట్టుబడులు పెడుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. వచ్చే ఐదు-ఆరేళ్లలో భారత్‌లో ఇంధన రంగంలో 67బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని స్పష్టం చేశారు. పెరుగుతున్న ఇంధన అవసరాల మధ్య, భారతదేశంలో ప్రతి ఒక్కరికీ సరసమైన ఇంధనం అందించబడుతోందన్నారు.