LOADING...
Delhi: ప్రధాని పిలుపుతో కారుకు బదులు సైకిల్‌.. ఇంధన పొదుపులో అధికారి ఆదర్శం.. ఇదిగో వీడియో!
ఇంధన పొదుపులో అధికారి ఆదర్శం.. ఇదిగో వీడియో!

Delhi: ప్రధాని పిలుపుతో కారుకు బదులు సైకిల్‌.. ఇంధన పొదుపులో అధికారి ఆదర్శం.. ఇదిగో వీడియో!

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత, ధరల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఆయన ఇచ్చిన సూచనకు అనేక మంది స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ శాఖ ఉప కమిషనర్‌ నరేంద్ర యాదవ్‌ తన ఖరీదైన కారును పక్కనపెట్టి కార్యాలయానికి సైకిల్‌పై వెళ్లడం ప్రారంభించారు. దేశం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో ప్రతి పౌరుడు చిన్నచిన్న మార్పుల ద్వారా దేశానికి సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

కారులో వెళ్లినా, సైకిల్‌పై వెళ్లినా సమయం పెద్దగా మారదు 

సైకిల్‌ వినియోగం వల్ల ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని నరేంద్ర యాదవ్‌ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రధాని ఇచ్చిన పిలుపును ఆచరణలో పెట్టాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండటంతో కారులో వెళ్లినా, సైకిల్‌పై వెళ్లినా సమయం పెద్దగా మారదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను సైకిల్‌పై కార్యాలయానికి వెళ్లడం చూసి సహచర ఉద్యోగులు కూడా ప్రేరణ పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమీప మార్కెట్‌కు వెళ్లేటప్పుడు లేదా ఇంటికి దగ్గరలో ఉన్న ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సైకిల్‌ను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.

వివరాలు 

ఒక్కరితో మొదలైన మార్పు ప్రజా ఉద్యమంగా మారే సత్తా ఉందని వెల్ల‌డి

ఒక్కరి ప్రయత్నం వల్ల మార్పు రాదని భావించకుండా, ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపులో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలు క్రమంగా ఈ అలవాటును స్వీకరిస్తే అది పెద్ద ప్రజా ఉద్యమంగా మారే అవకాశముందని అన్నారు. 'ఫిట్ ఇండియా' కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న నరేంద్ర యాదవ్‌, యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సైకిల్‌ తొక్కడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవచ్చని వివరించారు. అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఇంధన వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే.. 

Advertisement