మహాత్మా గాంధీ జయంతి: రాజ్‌ఘాట్ వద్ద ప్రధాని మోదీ సహా ప్రముఖుల నివాళులు
మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ జాతిపితకు నివాళులర్పించారు. దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అంతకుముందు మోదీ.. మహాత్మా గాంధీ సేవలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. మహాత్ముడి కాలాతీత బోధనలు దేశప్రజల మార్గాన్ని ప్రకాశవంతం చేస్తూనే ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు. గాంధీ బోధనల స్పూర్తి ఐక్యత, కరుణను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మొత్తం మానవాళిని ప్రేరేపిస్తుందన్నారు. ఆయన కలలను నెరవేర్చేందుకు అందరం కృషి చేద్దామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, దిల్లీ ఎల్జీ వీకే సక్సేనా కూడా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.