LOADING...
Pm Modi: నెహ్రూను అధిగమించనున్న మోదీ.. బుధవారంతో చారిత్రక ఘట్టం
నెహ్రూను అధిగమించనున్న మోదీ.. బుధవారంతో చారిత్రక ఘట్టం

Pm Modi: నెహ్రూను అధిగమించనున్న మోదీ.. బుధవారంతో చారిత్రక ఘట్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం చేరనుంది. వరుసగా ఎన్నికై అత్యధిక కాలం భారత ప్రధానిగా కొనసాగిన నేతగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును ఆయన బుధవారం అధిగమించనున్నారు. దీంతో స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో మోదీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోనున్నారు.

వివరాలు 

4,399 రోజులు

నరేంద్ర మోదీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా కొనసాగుతున్నారు. బుధవారం(జూన్ 10)నాటికి ఆయన ఎన్నికైన ప్రధానిగా 4,399 రోజుల సేవను పూర్తి చేసుకోనున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు మొత్తం 6,130 రోజుల పాటు ప్రధానిగా పనిచేశారు. అయితే స్వాతంత్ర్యం అనంతరం తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు ఆయన ఎన్నికైన ప్రధానమంత్రి కాదు. 1952 మే13న తొలి సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నుంచి 1964 మే27 వరకు వరుసగా 4,398రోజుల పాటు ఎన్నికైన ప్రధానిగా కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ అధిగమించబోతున్నారు.

వివరాలు 

మూడో స్థానంలో ఇందిరా గాంధీ

వరుసగా ఎన్నికై అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతల జాబితాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మూడో స్థానంలో ఉన్నారు. ఆమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి24 వరకు నిరవధికంగా 4,077 రోజుల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రభుత్వాధినేతగా మరో రికార్డు ఎన్నికైన ప్రభుత్వాధినేతగా (దేశం లేదా రాష్ట్రం)అత్యధిక కాలం ప్రజాసేవ చేసిన నాయకుడిగా కూడా నరేంద్ర మోదీ ఇప్పటికే చరిత్ర సృష్టించారు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ 8,930రోజుల సేవా కాలం రికార్డును ఈ ఏడాది మార్చిలో మోదీ అధిగమించారు. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం 2014 నుంచి ప్రధానిగా కొనసాగుతున్న ఆయన ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

Advertisement

వివరాలు 

12 ఏళ్లలో దేశంలో విస్తృత మార్పులు: మోదీ

గత 12 ఏళ్లలో పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతినే కేంద్రంగా చేసుకుని దేశంలో అనేక కీలక మార్పులు తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న వర్గాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), స్వచ్ఛ భారత్ మిషన్, పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాలను ప్రస్తావించిన ఆయన.. ప్రజలకు అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

Advertisement