PM Modi: 'అందరిని ప్రేమించండి, అందరికి సేవ చేయండి': ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
సత్యసాయి జయంత్యోత్సవాల్లో పాల్గొనడం తనకు గొప్ప భాగ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. ''సత్యసాయి ప్రేమకు, విశ్వమానవత్వానికి సజీవ చిహ్నం. ఆయన భౌతికంగా లేరని అనుకున్నా... ఆ అపారమైన ప్రేమ ఇంకా మన జీవితాల్లోనే కొనసాగుతోంది. బాబా బోధనల స్ఫూర్తి దేశం నలుమూలలా స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లాది భక్తులు నిస్వార్థ సేవలో తలమునకలై ఉండటం ఇందుకు నిదర్శనం. ఆయన ప్రేమసూత్రాలు ఎన్నో హృదయాలను మేల్కొల్పాయి, సమాజాన్ని మంచి దిశగా ఆలోచింపజేశాయి.
వివరాలు
రూ.100 జ్ఞాపిక నాణెం,నాలుగు తపాలా బిళ్లలను ఆవిష్కరించిన ప్రధాని
బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి.'అందరిని ప్రేమించండి...అందరికి సేవ చేయండి' అనే ఆయన సందేశం అనేక జీవితాలను పూర్తిగా మార్చేసింది.ఆయన ప్రేరణతో అనేక మంది సేవా యజ్ఞంలో ముందుకు సాగారు.ప్రజల కోసం అనేక అభ్యుదయ కార్యక్రమాలను బాబా చేపట్టారు. తాగునీరు,వైద్యం,విద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు అపారమైనవి. పుట్టపర్తి నేల ప్రత్యేక పవిత్రత కలిగినది. సత్యసాయి స్థాపించిన సంస్థలు ఇదే విధంగా ప్రేమ, సేవలతో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను'' అని మోదీ పేర్కొన్నారు. తరువాత సత్యసాయి జీవితం,బోధనలు,సేవలను స్మరించుకుంటూ రూపొందించిన రూ.100 జ్ఞాపిక నాణెం,నాలుగు తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.