LOADING...
PM Modi: నేడు కర్ణాటక,గోవాలో ప్రధాని పర్యటన.. 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహం ఆవిష్కరణ
నేడు కర్ణాటక,గోవాలో ప్రధాని పర్యటన..77అడుగుల రాముడి కాంస్య విగ్రహం ఆవిష్కరణ

PM Modi: నేడు కర్ణాటక,గోవాలో ప్రధాని పర్యటన.. 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహం ఆవిష్కరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ ఆధ్యాత్మిక సంపదను ప్రతిబింబిస్తూ, గీతా పారాయణం నుంచి రాముడి విగ్రహ ఆవిష్కరణ వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొని దేశ సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కర్నాటక, గోవా పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆయన మొదటగా కర్నాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించి, 'లక్ష కంఠ గీతా పారాయణం' కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మునులు, పండితులు, సాధారణ ప్రజలు ఇలా మొత్తం ఒక లక్ష మంది కలిసి భగవద్గీతను ఏకకంఠంతో పారాయణం చేయనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ఉడుపిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

వివరాలు 

'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'

10 మంది ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, 1,608 మంది కానిస్టేబుళ్లు, 6 క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో కలిపి సుమారు 2 వేల మంది పోలీసులు కట్టు దిట్టమైన భద్రతను నిర్వహించనున్నారు. రోడ్ షో కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తర్వాత మధ్యాహ్నం 3.15 గంటలకు మోదీ నేరుగా సౌత్ గోవాలోని కుశవతి నది తీరంలో ఉన్న శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠానికి చేరుకుని మఠం 550వ వార్షికోత్సవ స్మారక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' శిల్పి రామ్ సుతార్ రూపొందించారు.

వివరాలు 

గోవాలో ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక ఆకర్షణ

త్వరలోనే ఇది గోవాలో ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక ఆకర్షణగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. అదే వేళ రామాయణ థీమ్ పార్క్ గార్డెన్‌ను ప్రారంభించి, ప్రత్యేక పోస్టల్ స్టాంప్, స్మారక నాణాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. అనంతరం భక్తులకు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ వేడుకలో ప్రధాని తో పాటు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపద్ నాయక్ పాల్గొననున్నారు.

Advertisement