Ayodhya Ram : నేడే రామాలయంపై ధ్వజారోహణం.. ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర క్షేత్రం అయోధ్యలో మరో చారిత్రాత్మక సందర్భం ఆవిష్కృతం కానుంది. ఎన్నాళ్లుగానో భక్తులు ఎదురుచూస్తున్న రామాలయ ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం జరగబోతోంది. ఈ సందర్బంగా మందిరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ధర్మ ధ్వజారోహణ వేడుకను పురస్కరించుకుని, రామాలయ ప్రాంగణాన్ని 100 టన్నుల పుష్పాలతో అద్భుతంగా సింగారించారు. గర్భగుడి పైభాగంలో ఆవిష్కరించబడనున్న కాషాయ వర్ణ ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఈ జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదర చెట్టు (మందార, పారిజాత మొక్కలను కశ్యపముని కలపడంతో ఆవిర్భవించిన చెట్టు), ఓం చిహ్నాలు ఉండనున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది
వివరాలు
మొదటి అంతస్తులో రామదర్బార్:
ఆలయ తొలి అంతస్తులో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడితో కూడిన రామదర్బార్ ప్రతిష్ఠాపన జరుగుతుందని రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర పేర్కొన్నారు. ఈ మహోత్సవానికి సుమారు ఏడు వేల మంది విశిష్ట అతిథులు హాజరుకానున్నట్లు రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. సమగ్ర భద్రతా చర్యలతో ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక వేడుకను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.