PM Modi: ఆర్టికల్ 370ని రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన మోదీ.. దీన్ని చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370రద్దుపై నేటి సుప్రీంకోర్టు నిర్ణయం చారిత్రాత్మకమైనదన్నారు. 5ఆగస్టు 2019న భారత పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు సమర్థించినట్లు పేర్కొన్నారు. జమ్మూ, కశ్మీర్, లద్ధాఖ్‌లోని సోదరసోదరీమణుల ఆశలు, పురోగతి, ఐక్యతకు సంబంధించి ఇదొక గొప్ప ప్రకటన అన్నారు. 370కారణంగా నష్టపోయిన సమాజంలోని అత్యంత బలహీనమైన, అట్టడుగు వర్గాలకు అండగా ఉంటామన్నారు. ఐక్యమైన భారతదేశాన్ని నిర్మించాలనే తమ సామూహిక సంకల్పానికి నేటి సుప్రీంకోర్టు తీర్పు నిదర్శనమన్నారు.