PM Modi: బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుస్తుంది: ప్రధాని మోదీ
మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో కలిసి మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. అనంతరం ఝబువాలో జరిగిన జన్ జాతీయ మహాసభను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. కేంద్రంలో, రాష్ట్రంలోని బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం రెట్టింపు వేగంతో పనిచేస్తోందన్నారు. బీజేపీకి ఉన్న ప్రజాదరణ వాస్తవాన్ని ప్రతిపక్ష నాయకులు అంగీకరించారని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘనవిజయం సాధిస్తుందన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370 సీట్లకు పైగా గెలుస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
బూత్‌లో అదనంగా 370 ఓట్లు వచ్చేలా చూడాలి: మోదీ
గత ఎన్నికలతో పోల్చితే ఒక్కో బూత్‌లో అదనంగా 370 ఓట్లు వచ్చేలా చూడాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. గిరిజన సంఘాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాని మోదీ.. గిరిజనులు ఓటు బ్యాంకు కాదని, వారు దేశానికి గర్వకారణమన్నారు. 2024 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రంలో ఆరు గిరిజన రిజర్వ్ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నీరు, మౌలిక సదుపాయాలను కల్పనే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.