PM Modi and Xi Jinping: 5 ఏళ్ళ తరువాత తొలిసారి భేటీ కానున్న మోదీ, జిన్‌పింగ్
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి రష్యా వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో త్వరలో సమావేశమవుతారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ సమావేశం ఐదేళ్ల తర్వాత ఇరు దేశాధినేతల మధ్య జరుగుతున్న తొలి ముఖాముఖి చర్చ కావడం విశేషం. ఇరుదేశాల మధ్య సరిహద్దు గస్తీకి సంబంధించిన తాజా ఒప్పందం నేపథ్యంలో, ఈ భేటీ జరగనుండటంపై ఆసక్తి నెలకొంది గత నాలుగున్నరేళ్లుగా గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలతో పాటు సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
పుతిన్‌తో మోదీ సమావేశం
గత నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు నిలిపివేయబడటం, గతంలో జరిగిన బ్రిక్స్, జీ20 సదస్సుల్లో ఇద్దరు నేతలు సమావేశం అయినప్పటికీ, ప్రత్యక్షంగా ఇరువురి మధ్య ప్రత్యేక భేటీ జరగకపోవటం గమనార్హం. ప్రధాని మోదీ మంగళవారం రష్యా లోని కజాన్ నగరంలో బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి చేరుకున్నారు. గత మూడు నెలల్లో ఇది ఆయన రష్యా పర్యటనలో రెండోసారి అని సమాచారం. కజాన్ చేరిన కాసేపటికే ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించుకున్నారు.