PM SHRI School: పీఎంశ్రీ బడులు.. భవిష్యత్ విద్యకు బలమైన పునాది
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన, అభ్యసనంతో పాటు సమగ్రాభివృద్ధి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎంశ్రీ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఉత్తర్‌ప్రదేశ్ (1,725) తర్వాత అత్యధికంగా 935 పీఎంశ్రీ పాఠశాలలను మన రాష్ట్రం సాధించడం గమనార్హం. ఈ పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా భరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎంశ్రీ పాఠశాలల మౌలిక సదుపాయాల కోసం కేంద్రం రూ. 407.53 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో పాఠశాలల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
Details
వృత్తి విద్యకు ప్రాధాన్యం
విద్యార్థుల సంఖ్య ఆధారంగా పీఎంశ్రీ పాఠశాలలకు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు నిర్వహణ నిధులను విడుదల చేశారు. పీఎంశ్రీ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులు అందిస్తున్నారు. మొదటి, రెండో విడతలో మంజూరు చేసిన 794 పాఠశాలల్లో 10 ట్రేడ్‌లలో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు శిక్షణ అందించేందుకు మొత్తం 1,898 మంది శిక్షకులను నియమించగా, వీరిలో 400 మంది జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ) ధ్రువీకరణ పొందిన వృత్తి విద్యా ఉపాధ్యాయులు. ప్రాక్టికల్ జ్ఞానం పెంపొందించేందుకు పాఠశాలల్లో 1,898 ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు.
Details
విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు
దసరా, సంక్రాంతి సెలవుల సమయంలో సమీప పరిశ్రమలు, సంస్థల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 10,240 మంది విద్యార్థులు 80 గంటల ఇంటర్న్‌షిప్‌ను పూర్తిచేయగా, ప్రస్తుతం 9,700 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లో పాల్గొంటున్నారు. చదువుతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగేలా ఈ కోర్సులను రూపకల్పన చేశారు. వృత్తి విద్యా కోర్సుల పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన 'కౌశల్ బోధ్' పుస్తకాలను అందిస్తున్నారు.
Details
ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేక కేంద్రాలు
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం పీఎంశ్రీ పాఠశాలల్లో ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న తరగతి గదులను ఆటిజం కేంద్రాలుగా మారుస్తారు. డిజిటల్ అభ్యసన పరికరాలు, సెన్సరీ కిట్లు, ఇతర ప్రత్యేక సామగ్రిని అందిస్తారు. వ్యక్తిగత అభ్యాస విధానం (పాల్)ను అమలు చేస్తూ, విద్యార్థులు తమ స్థాయికి అనుగుణంగా ఆన్‌లైన్‌లో నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.
Details
పీఎంశ్రీ పాఠశాలల్లో కల్పించే సదుపాయాలు
స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు మరుగుదొడ్లు, చేతులు కడుక్కునేందుకు ప్రత్యేక పాయింట్లు విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్ల పంపిణీ, వెండింగ్ మెషీన్ల ఏర్పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవసరమైన ఫర్నిచర్ భౌతిక, రసాయన, జీవశాస్త్ర ప్రయోగశాలలు బడులకు ఇంటర్నెట్ సదుపాయం, సీసీ కెమెరాల ఏర్పాటు కంప్యూటర్ ల్యాబ్‌లు, స్మార్ట్ తరగతి గదులు, గ్రంథాలయాలు క్రీడా మౌలిక సదుపాయాలతో ఆటస్థలాల అభివృద్ధి బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ, విద్యార్థుల కెరీర్‌కు కౌన్సెలింగ్ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపొందనకు స్కౌట్స్, గైడ్స్ కార్యక్రమాలు పాఠశాల బ్యాండ్లు, సంగీతం వంటి కళల్లో శిక్షణ
Details
కార్పొరేట్ బడులకు దీటుగా అభివృద్ధి : బి. శ్రీనివాసరావు
పీఎంశ్రీ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు సమానంగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని విద్యాశాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలలకు అధికంగా నిధులు మంజూరు చేస్తోందని పేర్కొంది. విద్యాశాఖ మంత్రి లోకేశ్ చొరవతో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అత్యధిక సంఖ్యలో పీఎంశ్రీ పాఠశాలల ఆమోదం పొందిందని అధికారులు వెల్లడించారు. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు శ్రీనివాసరావు, ఎస్పీడీ, ఎస్‌ఎస్‌ఏ తెలిపారు.