LOADING...
Cm chandrababu: 2027 మార్చికల్లా పోలవరం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
2027 మార్చికల్లా పోలవరం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Cm chandrababu: 2027 మార్చికల్లా పోలవరం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

2027 మార్చి నెలాఖరులోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తొలి దశలో 119 టీఎంసీల నీటిని నిల్వ చేసి, కుడి-ఎడమ ప్రధాన కాలువలకు గ్రావిటీ విధానంలో నీటిని తరలిస్తామని వెల్లడించారు. పోలవరం కుడి కాలువ పనులు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని,ఎడమ కాలువ నిర్మాణాన్ని ఈ ఏడాది మార్చి చివరికి ముగిస్తామని తెలిపారు. తొలిదశ పునరావాసంలో భాగంగా 38,060 నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజీలు అందించి,అవసరమైన కాలనీలు నిర్మించి తరలించే ప్రక్రియను ఈ ఏడాది ముగింపు నాటికి పూర్తి చేస్తామని సీఎం చెప్పారు. బుధవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు,నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వివరాలు 

 ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం 

అనంతరం పోలవరం ప్రాజెక్టు, జలవనరుల శాఖ, పునరావాస విభాగం అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించి, తరువాత మీడియాతో మాట్లాడారు. గతంలో రూ.400 కోట్ల వ్యయంతో నిర్మించిన డయాఫ్రం వాల్‌ ధ్వంసం కావడంతో, దాన్ని పక్కనపెట్టి మరో రూ.1,000 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్‌ను నిర్మిస్తున్నామని సీఎం వివరించారు. ఈ పనులు ఇప్పటికే 87 శాతం పూర్తయ్యాయని, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. కుడి-ఎడమ అనుసంధాన టన్నెల్లు, నావిగేషన్ కాలువ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయని చెప్పారు. గ్యాప్-1 ప్రధాన డ్యాం పనులు జూన్ చివరికి, గ్యాప్-2 ప్రధాన డ్యాం పనులు 2027 మార్చి నాటికి పూర్తవుతాయని వెల్లడించారు.

వివరాలు 

అదనపు స్లూయిస్‌ల  ఏర్పాటు 

పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి నుంచి విశాఖ వరకు మిగిలిన అనుబంధ పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎడమ, కుడి కాలువల ద్వారా రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, చెరువులు, జలాశయాలు ఈ నీటితో నిండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అవసరమైతే అదనపు స్లూయిస్‌లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. పునరావాస పనులు ఈ ఏడాది చివరికి పూర్తయ్యేలా నెలవారీ లక్ష్యాలతో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని, అమలును తానే పర్యవేక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

పండగకు ముందే సమగ్ర ప్రజంటేషన్‌ 

పోలవరం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. డ్యాం పరిసరాల్లో 9,000 ఎకరాల్లో చేపట్టనున్న పర్యాటక ప్రాజెక్టుపై జపాన్ కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన ప్రజంటేషన్‌ను ఆయన పరిశీలించారు. స్పిల్‌వే సుందరీకరణను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించిన ప్రణాళికలనూ చూశారు. సంక్రాంతికి ముందే అమరావతికి వచ్చి మరోసారి పూర్తి స్థాయి ప్రజంటేషన్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. డెడ్ స్టోరేజ్ నుంచి చేపట్టిన ఎత్తిపోతల పథకంలో సివిల్ పనులను ముందుగా పూర్తి చేయాలని, పంపుల ఏర్పాటు అంశాన్ని తరువాత పరిశీలిద్దామని చంద్రబాబు సూచించారు.

Advertisement

వివరాలు 

పండగకు ముందే సమగ్ర ప్రజంటేషన్‌ 

అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా నావిగేషన్, ఇన్‌ల్యాండ్ వాటర్‌వే వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా జలరవాణా జరిగేలా కాకినాడ పోర్టు వరకు కాలువల ద్వారా రవాణా సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ అంశాలపై జాతీయ రహదారుల అనుసంధానంతో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

వివరాలు 

అంతర్గత నదుల అనుసంధానానికి మోదీ అనుమతి 

నదుల అనుసంధానం తన చిరకాల స్వప్నమని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నదులన్నీ సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో, వంశధార-గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్‌ను కరవు లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో అంతర్గత నదుల అనుసంధానానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఆమోదం తెలిపారని చెప్పారు. గంగా-కావేరి నదుల అనుసంధాన ప్రణాళిక కూడా అమలులోకి రానుందని తెలిపారు.

వివరాలు 

అంతర్గత నదుల అనుసంధానానికి మోదీ అనుమతి 

సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ప్రజంటేషన్ ఇచ్చారు. పునరావాసానికి సంబంధించి ఇళ్ల నిర్మాణం, ప్యాకేజీల అమలులో ఎదురవుతున్న సమస్యలను జిల్లా కలెక్టర్లు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇంజినీర్-ఇన్-చీఫ్ నరసింహమూర్తి, పునరావాస కమిషనర్ ప్రశాంతి, మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement