Polavaram: 2027 పుష్కరాలే లక్ష్యంగా ఊపందుకున్న పోలవరం పనులు
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి పుష్కరాలు జరిగే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగానే పనులు ముందుకు సాగుతున్నాయని, జనవరి చివరి వారంలో ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం కూడా స్పష్టం చేసింది. గతంలో "పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం,ఇది పూర్తిగా సాంకేతిక సమస్యలతో నిండి ఉంది" అంటూ వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి జలవనరుల మంత్రి చేతులెత్తేయడం తెలిసిందే. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఆ సవాళ్లను ఎదుర్కొని తక్కువ కాలంలోనే స్పష్టమైన ఫలితాలు చూపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే నిధులు విడుదల చేస్తుండటంతో పనులకు ఊపు వచ్చింది.
వివరాలు
2024 జూన్ నాటికి పరిస్థితి
ప్రస్తుతం పోలవరంలో ప్రధానంగా మిగిలింది ప్రధాన డ్యాం నిర్మాణం మాత్రమే. మరోవైపు కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనులు వేగంగా పూర్తవుతున్నాయి. తొలిదశ పునరావాసాన్ని కూడా అదే సమయంలో ముగించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నిర్మించినప్పటికీ అవసరమైన ప్రమాణాలు పాటించకపోవడం, సీపేజీ నియంత్రణపై కేంద్ర నిపుణులు హెచ్చరించినా పట్టించుకోకపోవడం వల్ల తీవ్ర సమస్యలు తలెత్తాయి. కాఫర్ డ్యాంలు నిర్మించిన ఉద్దేశమే నెరవేరలేదు. ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతంలో నీరు చేరకుండా చూడాల్సిన చోట, ఎగువ కాఫర్ డ్యాం నుంచి భారీగా సీపేజీ రావడంతో ప్రధాన డ్యాం ప్రాంతం గోదావరి ప్రవాహంలా మారింది. పనులు ఎలా కొనసాగించాలన్న దానిపై అధికారులు అయోమయానికి గురయ్యారు.
వివరాలు
2026 ఫిబ్రవరి నాటికి
విదేశీ నిపుణుల బృందం ఇప్పటికే ఆరుసార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, కేంద్ర జలసంఘం సహా వివిధ కేంద్ర సంస్థల నిపుణులతో కలిసి సమస్యలను లోతుగా అధ్యయనం చేసింది. ఎగువ కాఫర్ డ్యాం పక్కనే బట్రస్ డ్యాం నిర్మించాలని వారు సూచించారు. ఆ సిఫార్సుల మేరకు 2025 జూన్ నాటికి బట్రస్ డ్యాం నిర్మాణం పూర్తయింది. దీంతో వరదల సమయంలో సీపేజీ గణనీయంగా తగ్గింది. మిగిలిన నీటిని పంపుల ద్వారా బయటకు పంపడంతో, 2025 జులై నుంచి నవంబరు వరకు వరదలు ఉన్నా ఎలాంటి ఆటంకం లేకుండా పనులు కొనసాగించగలిగారు.
వివరాలు
అగాధాల సమస్యకు పరిష్కారం
వైకాపా ప్రభుత్వం ఎగువ కాఫర్ డ్యాంలో ఏర్పడిన గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడం వల్ల పరిస్థితి మరింత చేదుగా మారింది. హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. 2020 జులైలో ఆ గ్యాప్‌ల మధ్య నుంచి వచ్చిన వరద ప్రవాహం కారణంగా ప్రధాన డ్యాం ప్రాంతంలో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. 2026 ఫిబ్రవరి నాటికి ఆ అగాధాలన్నింటినీ పూర్తిగా పూడ్చివేశారు. ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్ చేసి, నేలను ప్రత్యేకంగా ట్రీట్ చేశారు. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
వివరాలు
నిధుల సమీకరణ - పునరావాసంలో పురోగతి
2024 జూన్ నాటికి.. పోలవరం ప్రాజెక్టుకు రూ.55,455 కోట్ల అంచనాలకు 2019 ఫిబ్రవరిలోనే సాంకేతిక సలహా కమిటీ ఆమోదం ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వ అనుమతి అప్పటివరకు రాలేదు. తొలిదశలో +41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు నిధులు కావాలని జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. 2024 మే నాటికి కేంద్రం నుంచి పొందాల్సిన బిల్లులు రూ.2,697కోట్లకు చేరాయి. 2026 ఫిబ్రవరి నాటికి కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే పోలవరంలో పనులు, పునరావాసానికి కలిపి రూ.4,747కోట్ల ఖర్చు చేశారు. తొలిదశలో మిగిలిన పనులకు అవసరమైన రూ.12,157కోట్లను కేంద్రం అడ్వాన్సుగా ఇవ్వనున్నట్లు ప్రకటించి,ఇప్పటికే నిధులు విడుదల చేస్తోంది. కేంద్రం ఇప్పటివరకు ఇచ్చిన రూ.4,318కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వినియోగించింది.మూడో విడత అడ్వాన్సు నిధులు కూడా త్వరలో రానున్నాయి.
వివరాలు
డయాఫ్రం వాల్ పనులు: నాడు - నేడు
2024 జూన్ నాటికి 2020 వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం ఏడాది తర్వాతే గుర్తించారు. ఆపై తీసుకోవాల్సిన నిర్ణయాలు మరింత ఆలస్యమయ్యాయి. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలా? లేక పాతదాన్ని మరమ్మతు చేయాలా? అన్న అంశంపైనా స్పష్టత లేకుండా కాలం గడిచింది. 2026 ఫిబ్రవరి నాటికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర జలసంఘం పాత డయాఫ్రం వాల్ స్థానంలోనే కొత్తదాన్ని నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చింది. 2025 జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బావర్ కంపెనీ 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపింది. మొత్తం 65,352 క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉండగా, ఇప్పటికే 59,490 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి.
వివరాలు
ఇక మిగిలింది ప్రధాన డ్యాం నిర్మాణమే
1,350 మీటర్ల పొడవులో నిర్మించాల్సిన డయాఫ్రం వాల్‌లో 1,128 మీటర్లు పూర్తయ్యాయి. అంటే దాదాపు 91 శాతం పనులు ముగిశాయి. ఫిబ్రవరి చివరికి మొత్తం నిర్మాణం పూర్తవుతుంది. ప్రస్తుతం ప్రధాన డ్యాం నిర్మాణ పనులు మొదలయ్యాయి. డయాఫ్రం వాల్ ఉన్న ప్రాంతంలో రాతి, మట్టి కట్టతో ప్రధాన డ్యాంను గ్యాప్-1, గ్యాప్-2 అనే రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. గ్యాప్-1కు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగులకు కేంద్ర జలసంఘం ఆమోదం ఇచ్చింది. +25 మీటర్ల నుంచి +53.32 మీటర్ల ఎత్తు వరకు, 584 మీటర్ల పొడవునా ఈ భాగాన్ని నిర్మించాలి. మొత్తం 12 లక్షల క్యూబిక్ మీటర్ల పనిలో, గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటివరకు 1.61 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తైంది.
వివరాలు
ఇక మిగిలింది ప్రధాన డ్యాం నిర్మాణమే
గ్యాప్-2కు సంబంధించిన ఆకృతులకు విదేశీ నిపుణుల బృందం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వారి లిఖితపూర్వక అనుమతులు రావాల్సి ఉంది.ఈ డ్యాంను 1.74 కిలోమీటర్ల పొడవునా నిర్మించాలి. ప్రస్తుతం ఇసుక రీచ్‌లో +26 మీటర్ల వరకు ఎంబ్యాంక్‌మెంట్ పనులకు అనుమతులు లభించడంతో అక్కడ పనులు కొనసాగుతున్నాయి. కుడి కాలువ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.ఎడమ కాలువ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయి. తొలిదశలో పోలవరంలో +41.15 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేయనున్నారు.ఇందుకు 38,060 నిర్వాసిత కుటుంబాలను తరలించాల్సి ఉండగా,ఇప్పటికే 16,291 కుటుంబాలను పునరావాసానికి తరలించారు. ఇంకా 21,769కుటుంబాలు తరలించాల్సి ఉంది.మిగిలిన 49పునరావాస కాలనీల నిర్మాణానికి మార్చిలో టెండర్లు ఖరారు చేసి, 2026 డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.