
Ponnam Prabhakar: హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో కొత్త పాస్‌పోర్ట్ ఆఫీస్.. ప్రారంభించిన మంత్రి పొన్నం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ వాసులకు పాస్‌పోర్ట్ సేవలు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్(ఎంజీబీఎస్)మెట్రో స్టేషన్ లో ఒక కొత్త పాస్‌పోర్ట్ సేవా కేంద్రం(PSK) ఏర్పాటు చేశారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఈ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈమార్పుతో నగరంలో ఉన్న రెండు ప్రధాన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల చిరునామాలు మారిపోయాయి. వివరాల్లోకి వెళ్తే,ఇప్పటివరకు అమీర్‌పేటలోని ఆదిత్య ట్రేడ్ సెంటర్‌లో పనిచేస్తున్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని పూర్తిగా ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌కి తరలించారు. అదే విధంగా,టోలీచౌకీ షేక్‌పేట్‌లోని ఆనంద్ సిలికాన్ చిప్ భవనంలో పనిచేస్తున్న మరొక కేంద్రాన్ని రాయదుర్గం పాత ముంబయి రోడ్డులోని సిరి బిల్డింగ్‌లోకి మార్చారు.
వివరాలు
తెలంగాణలో మొత్తం ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
మంగళవారం నుండి ఈ రెండు కేంద్రాలు తమ కొత్త ప్రదేశాల నుండి పూర్తి స్థాయిలో పాస్‌పోర్ట్ సేవలను అందించడం ప్రారంభించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పాస్‌పోర్ట్ జారీ విషయంలో హైదరాబాద్ దేశవ్యాప్తంగా ఐదవ స్థానంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, పాస్‌పోర్ట్ జాయింట్ సెక్రటరీ కే.జె. శ్రీనివాసులు, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన తదితర ప్రముఖులు పాల్గొన్నారు.