Hyderabad : పేరు గొప్ప.. శుభ్రత డొల్ల.. 8 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఒకటి సీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
రుచికరమైన వంటకాలు.. అద్భుతమైన రేటింగ్‌లు.. కస్టమర్లను ఆకట్టుకునే ప్రచారం.. ఇలా పేరున్న హోటళ్లు, రెస్టారెంట్లలోనే పరిశుభ్రత ప్రమాణాలు గాలికొదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లపై తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అథారిటీ (టీజీ సేఫ్) గురువారం నిర్వహించిన తనిఖీల్లో పలు తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడ్డాయి. నగరంలోని కోర్ అర్బన్ రీజియన్‌లో 8 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో 15 ప్రముఖ రెస్టారెంట్లను తనిఖీ చేశాయి. నిబంధనలు పాటించని వాటిపై అక్కడికక్కడే చర్యలు తీసుకున్నారు. 8 హోటళ్ల లైసెన్సులను రద్దు చేయడంతోపాటు ఒక హోటల్‌ను సీజ్ చేసినట్లు టీజీ సేఫ్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు.
వివరాలు
లక్కీ రెస్టారెంట్(బాచుపల్లి)
బాచుపల్లిలోని లక్కీ రెస్టారెంట్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
రెస్టారెంట్‌లో బొద్దింకలు సంచరిస్తుండటంతోపాటు తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు కనిపించాయి. దీంతో అధికారులు రెస్టారెంట్‌ను అక్కడికక్కడే సీజ్ చేశారు.
అరోమా మల్టీకుసిన్‌లో ఎలుకలు, పిల్లులు
గచ్చిబౌలిలోని అరోమా మల్టీకుసిన్ రెస్టారెంట్‌లో ఎలుకలు కొరికిన ఆహార పదార్థాలు కనిపించాయి. రెస్టారెంట్ పరిసరాల్లో పిల్లులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు కూడా లభించాయి.
పక్వాన్ గ్రాండ్‌లో గడువు ముగిసిన బియ్యం
రాయదుర్గంలోని పక్వాన్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఏకంగా 1,170 గడువు ముగిసిన బియ్యం బస్తాలను అధికారులు గుర్తించారు. దీంతోపాటు 45 కిలోల లేబుల్ లేని నూడిల్స్, కుళ్లిపోయిన కోడిగుడ్లు లభించాయి.
వివరాలు
గోదావరి ఘుమఘుమల్లో పురుగులు పట్టిన కూరగాయలు
హఫీజ్‌పేట్‌లోని గోదావరి ఘుమఘుమలు రెస్టారెంట్‌లో పురుగులు పట్టిన కూరగాయలు గుర్తించారు. అక్కడి వంటగది కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గుట్కా నములుతూ వంటలు..
గచ్చిబౌలిలోని శ్రీకృష్ణ ఫ్యామిలీ డాబాలో ఆహార తయారీ సిబ్బంది గుట్కా నములుతున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. అంతేకాకుండా బూజు పట్టిన ఆహార పదార్థాలు కూడా లభించాయి.
శ్రీ సాయిమెస్-బాబాయ్ హోటల్‌లో ఈగలు, బొద్దింకలు
కొండాపూర్‌లోని శ్రీ సాయిమెస్-బాబాయ్ హోటల్‌లో కుళ్లిపోయిన కూరగాయలు కనిపించాయి. హోటల్ పరిసరాల్లో ఈగలు, బొద్దింకలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
వివరాలు
ఆదిత్య రెస్టారెంట్‌లో జిడ్డు ఫ్లోరింగ్
సఫిల్‌గూడలోని ఆదిత్య రెస్టారెంట్ అండ్ బార్‌లో ఫ్లోరింగ్, గోడలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఫ్లోరింగ్‌పై జిడ్డు పేరుకుపోయి ఉండటంతోపాటు గోడల పెచ్చులు ఊడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ కుళ్లిన కూరగాయలు కూడా లభించాయి.
స్పైసీ హబ్/గ్రీన్ ట్రీట్‌లో గడువు ముగిసిన ఆహారం
కొత్తపేటలోని స్పైసీ హబ్/గ్రీన్ ట్రీట్‌లో దుర్వాసన వస్తున్న ఫ్రిజ్‌లు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు కూడా అక్కడ ఉన్నట్లు తనిఖీల్లో తేలింది.
వైష్ణవి దర్శినిలో ఆహారంతోపాటు రసాయనాల నిల్వ
బేగంబజార్‌లోని వైష్ణవి దర్శినిలో బూజు పట్టిన ఆహార పదార్థాలు లభించాయి. రెస్టారెంట్‌లో సరైన వెలుతురు లేకపోవడంతోపాటు రసాయనాలు, ఆహార పదార్థాలను ఒకే చోట నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
వివరాలు
అసోనియో ఇండియన్ కిచెన్‌కు నోటీసు
పుప్పాలగూడలోని అసోనియో ఇండియన్ కిచెన్‌కు టీజీ సేఫ్ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
మరో ఐదు హోటళ్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు
లైసెన్సులు రద్దు చేయడం, హోటల్‌ను సీజ్ చేయడంతోపాటు నిబంధనలను సరిగా పాటించని మరో ఐదు సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు.
గచ్చిబౌలిలోని గర్ల్‌ఫ్రెండ్ మండీ, యూసుఫ్‌గూడలోని బాక్స్ 8 మోజో పిజ్జా, హైటెక్ సిటీలోని సీజన్స్ ఎక్స్‌ప్రెస్, సైనిక్‌పురిలోని యమ్మీబీ, గుండిమైసమ్మలోని జేఎమ్‌జే బాయ్స్ హాస్టల్‌కు ఈ నోటీసులు ఇచ్చారు.
వివరాలు
త్వరలో మళ్లీ తనిఖీలు
ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు అందుకున్న సంస్థల్లో త్వరలో మరోసారి తనిఖీలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు.
అప్పటికీ పరిస్థితుల్లో మార్పు కనిపించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కల్తీ లేదా నాణ్యతపై అనుమానం ఉన్న 16 ఫుడ్ శాంపిళ్లను అధికారులు సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.