LOADING...
Andhra Pradesh: ఆగస్టు 15 నుంచి పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ అమలుకు ప్రభుత్వం కసరత్తు
ఆగస్టు 15 నుంచి పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ అమలుకు ప్రభుత్వం కసరత్తు

Andhra Pradesh: ఆగస్టు 15 నుంచి పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ అమలుకు ప్రభుత్వం కసరత్తు

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్నాళ్లుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను ప్రోత్సహించిన ప్రభుత్వం, రాష్ట్రంలో మారుతున్న జనాభా పరిస్థితులపై అప్రమత్తమైంది. యువత సంఖ్య క్రమంగా తగ్గుతూ, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో క్షేత్రస్థాయిలో సమతుల్యత కోసం చర్యలు ప్రారంభిస్తోంది. ఆగస్టు 15 నుంచి జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నెల నాలుగో శనివారం 'పిల్లలే సంపద' గ్రామసభలు నిర్వహించనుంది. జనాభాను కట్టడి చేయడం కంటే ప్రజల ఆరోగ్యం, కుటుంబ భద్రత, జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి పెడితే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్యంతో రూ.782.25 కోట్లతో పలు ప్రణాళికలు అమలు చేయనుంది.

వివరాలు 

నియంత్రణకు ముగింపు.. సంక్షేమానికి ప్రాధాన్యం

జనాభా నియంత్రణ విధానాలను తగ్గిస్తూ, జనాభా సంరక్షణపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హక్కుల ఆధారిత విధానంతో కుటుంబాల అవసరాలను గౌరవిస్తూ సమగ్ర సంక్షేమాన్ని ప్రోత్సహించనుంది. పిల్లల పెంపకం ఖర్చులు అధికమని 53.7 శాతం మంది వెల్లడించిన నేపథ్యంలో, ఆ భారం తగ్గించే చర్యలకు ప్రాధాన్యం ఇస్తోంది.

వివరాలు 

సంక్షేమం, అభివృద్ధి కోసం కీలక చర్యలు

మొత్తం సంతానోత్పత్తి రేటును 2.1కు పెంచడం ప్రధాన లక్ష్యం. ప్రతి సంవత్సరం 50 వేల జంటలకు ఉచిత గర్భధారణ సహాయక సేవలు అందిస్తారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు ప్రాధాన్యం తగ్గిస్తారు. అందరికీ శాతం వంద ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెస్తారు. ఈ ఏడాది జూన్ నాటికి 5.2 కోట్ల మందిని జాతీయ ఆరోగ్య గుర్తింపు కార్యక్రమంలో చేర్చనున్నారు. మహిళల ఉపాధి భాగస్వామ్యాన్ని 25 శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటారు. శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు, ఏడాది పాటు తల్లిదండ్రులకు ప్రసూతి సెలవులు, ఉద్యోగినుల నివాస గృహాల నిర్మాణం చేపడతారు. అన్ని జిల్లాల్లో వృద్ధుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇతరులపై ఆధారపడే వారి సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకుంటారు.

Advertisement

వివరాలు 

ప్రధాన సవాళ్లు

జీవితాంత నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా 80 శాతం ఉద్యోగ అవకాశాల సాధనపై దృష్టి సారిస్తారు. ప్రతి సంవత్సరం 10 వేల మందికి సంరక్షణ రంగంలో శిక్షణ ఇస్తారు. మొత్తం సంతానోత్పత్తి రేటు 2.1ఉండాల్సి ఉండగా,రాష్ట్రంలో అది 1.5కు పడిపోయింది. జిల్లాల వారీగా చూస్తే కర్నూలు జిల్లా 1.89తో ముందంజలో ఉండగా, విశాఖ జిల్లా 1.32తో చివరిస్థానంలో ఉంది. వృద్ధుల సంఖ్య పెరగడం, మధ్య వయసు జనాభా అధికమవడంతో సమాజం వృద్ధాప్య దశలోకి వెళ్తోంది. ప్రస్తుతం మధ్యస్థ వయసు 32.5సంవత్సరాలు. 2036 నాటికి 60 ఏళ్లు పైబడిన జనాభా 19శాతానికి చేరే అవకాశం ఉంది. మహిళల ఉపాధి భాగస్వామ్యం 31శాతం మాత్రమే ఉండటంతో రాష్ట్ర ఆర్థికోత్పత్తిలో 15 శాతం వరకు నష్టం సంభవించే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

ముఖ్యమంత్రి పర్యవేక్షణలో అమలు

ఈ విధానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, అమలు విధానాన్ని స్వయంగా పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆయన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సంఘం ఏర్పాటు చేస్తారు. ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జనాభా స్థిరీకరణ బృందం పనిచేస్తుంది. రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమన్వయం జరుగుతుంది. సమాచార సాంకేతిక శాఖ ద్వారా గణాంకాల విశ్లేషణ, పర్యవేక్షణ వ్యవస్థలు నిర్వహిస్తారు. కలెక్టర్లు ప్రతి నెల, తహసీల్దార్లు ప్రతి వారం సమీక్ష సమావేశాలు నిర్వహించి అమలు వేగవంతం చేస్తారు. పనితీరు ఆధారంగా కార్యాలయాలకు ప్రోత్సాహకాలు, పురస్కారాలు అందజేస్తారు.

Advertisement