
Posani Muralikrishna: వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
ఈనెల 23 వరకు రిమాండ్ విధించగా, విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.
అనంతరం మళ్లీ కస్టడీకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈలోపే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఇంతకుముందు కూడా పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడుసార్లు అరెస్ట్ అయ్యి, మూడుసార్లు బెయిల్ పొందారు.
వివరాలు
పోసాని విడుదలపై ఉత్కంఠ
జైలు నుంచి విడుదల అవుతారని భావించిన సమయంలో సీఐడీ అధికారులు పీటీ వారెంట్ నమోదు చేసి, గుంటూరు కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు ఆయనకు ఈనెల 23 వరకు రిమాండ్ విధించడంతో పాటు, ఒకరోజు కస్టడీకి కూడా అనుమతి ఇచ్చింది.
తాజాగా గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, పోసాని విడుదలపై ఉత్కంఠ నెలకొంది.
ఎందుకంటే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నమోదైన కేసుల కారణంగా పోలీసులు మరోసారి పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకుంటారా? లేకుండా ఆయన నిజంగానే విడుదల అవుతారా? అనే ప్రశ్నపై స్పష్టత రావాల్సి ఉంది.
రేపు (శనివారం) ఉదయం పోసాని విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.