Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీ.. సీఎంఓ వరకు చేరిన కనకదుర్గ ఆలయ వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో పవర్ కట్‌కు సంబంధించిన వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంద్రకీలాద్రిపై చెలరేగిన ఈ వివాదం ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వరకు చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో శీనా నాయక్‌పై దేవాదాయ శాఖ కమిషనర్ రాంచంద్రమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు విద్యుత్ శాఖ అధికారులు మరియు ఆలయ అధికారులు మధ్య కొనసాగిన పవర్ కట్ వివాదం, తాజాగా ఈవో, దేవాదాయ కమిషనర్ మధ్య మాటల యుద్ధంగా మారింది. దీనితో పరిస్థితి మరింత వేడెక్కింది.
Details
సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ
నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా కూడా ఈవో-కమిషనర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆలయంలో జరుగుతున్న పరిణామాలను సోషల్ మీడియా, మీడియా కథనాల ద్వారానే తెలుసుకోవాల్సి వస్తోందని ఈవోపై కమిషనర్ రాంచంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఈ అంశంపై సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ కోరుతున్నారని ఈవోకు కమిషనర్ స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో సీఎంఓకి తాను ఏ విధంగా సమాధానం ఇవ్వాలంటూ ఈవోను కమిషనర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై చెలరేగిన ఈ పవర్ కట్ వివాదం మరెంత స్థాయికి చేరుతుందోనన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది.