Telangana: కరెంటు షాక్‌తో మరణిస్తే రూ.8 లక్షలు.. విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
విద్యుత్ షాక్‌తో జరిగే ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.5లక్షల పరిహారాన్ని రూ.8లక్షలకు పెంచాలని విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పెంపు ఈ నెల 1వ తేదీ నుంచే అమల్లోకి రావాలని స్పష్టం చేసింది. వినియోగదారుల నిర్లక్ష్యం లేదా పొరపాటు వల్ల ప్రమాదం జరిగినా ఇదే పరిహారం వర్తిస్తుందని పేర్కొంది. ప్రమాదం జరిగిన తర్వాత రెండు నెలలలోగా పరిహారం చెల్లించకపోతే, అందుకు కారణాలను డిస్కంలు వెల్లడించాల్సి ఉంటుందని ఈఆర్‌సీ బుధవారం విడుదల చేసిన టారీఫ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విద్యుత్ చార్జీలనే కొనసాగించాలని నిర్ణయించింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా డిస్కంలకు పలు సూచనలు కూడా ఇచ్చింది.
వివరాలు
ట్రూఅప్ ఛార్జీలకు అనుమతి
ఇక 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఈఆర్‌సీ మొదట అనుమతించినదానికంటే రూ.7,635 కోట్ల అదనపు వ్యయం నమోదైనందున, ఆ మేరకు ట్రూఅప్ ఛార్జీలకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల ద్వారా వసూలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో, రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ అంశంపై నిర్ణయం వాయిదా వేసినట్లు తెలిపింది. అనుమతించిన లోడ్ కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగిస్తున్నహైటెన్షన్ (హెచ్‌టీ) వినియోగదారులపై అదనపు చార్జీలు విధించడం సమర్థించినప్పటికీ, సరైన అవగాహన లేకుండా వెంటనే అమలు చేయడం తప్పని పేర్కొంది. అందువల్ల తొలి రెండు నెలల్లో వసూలు చేసిన అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, వచ్చే ఆరు నెలల బిల్లుల్లో సర్దుబాటు చేయాలని డిస్కంలను ఆదేశించింది.
వివరాలు
రూ.49,230 కోట్లకే ఈఆర్‌సీ ఆమోదం
ఇదే విధంగా,రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేసిన కరెంటుకంటే ఎక్కువ యూనిట్లు వినియోగించిన వినియోగదారుల నుంచి అధిక రేట్ల ప్రకారం వసూలు చేసిన అదనపు మొత్తాన్ని కూడా రాబోయే మూడు నెలల బిల్లుల్లో తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి కరెంటు కొనుగోలు వ్యయం రూ.54,567 కోట్లు కావాలని డిస్కంలు ప్రతిపాదించగా, విచారణ అనంతరం రూ.49,230 కోట్లకే ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది.
వివరాలు
రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేల కోట్లు
అలాగే మొత్తం వ్యయాలు రూ.72,996 కోట్లు అవుతాయని డిస్కంలు అంచనా వేయగా, రూ.64,950.72 కోట్లకే అనుమతి ఇచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఉత్తర, దక్షిణ డిస్కంల ఆదాయం-వ్యయాల మధ్య రూ.15,105.91 కోట్ల లోటు ఉంటుందని ఈఆర్‌సీ తెలిపింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేల కోట్లు అందించేందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. మిగిలిన మొత్తాన్ని డిస్కంల రెగ్యులేటరీ ఆస్తులుగా పరిగణించాలని సూచించింది.