LOADING...
Mr. India 2026: మిస్టర్ ఇండియా 2026లో జాతీయ ఫైనలిస్ట్‌గా ప్రధాన్ రాఘవ
మిస్టర్ ఇండియా 2026లో జాతీయ ఫైనలిస్ట్‌గా ప్రధాన్ రాఘవ

Mr. India 2026: మిస్టర్ ఇండియా 2026లో జాతీయ ఫైనలిస్ట్‌గా ప్రధాన్ రాఘవ

వ్రాసిన వారు Sirish Praharaju
May 04, 2026
08:18 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడును ప్రతినిధ్యం వహిస్తూ 'మిస్టర్ ఇండియా 2026' పోటీల్లో ప్రధాన్ రాఘవ జాతీయ స్థాయి ఫైనలిస్ట్‌గా నిలిచారు. అయితే తన వేర్లు తెలుగు నేలతోనే అనుసంధానమై ఉన్నాయని ఆయన గర్వంగా చెబుతున్నారు. వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఈటుమారిపురం గ్రామం. ఆయన తండ్రి రాఘవ వెంకట సత్యనారాయణ ఉద్యోగ కారణంగా 1965లో తమిళనాడుకు వచ్చి అక్కడే కుటుంబంతో స్థిరపడ్డారు. ప్రధాన్ రాఘవకు తల్లి శిరీష, సోదరుడు సాయికీర్తి ఉన్నారు. సాయికీర్తి క్రికెట్ క్రీడలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రధాన్ చెన్నైలోని లయోలా కళాశాలలో ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్నారు. చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఖేలో ఇండియా టెన్నిస్ పోటీల్లో విశ్వవిద్యాలయ స్థాయి విజేతగా నిలిచారు.

వివరాలు 

దేశవ్యాప్తంగా 18 మందిలో ఒకరు

అయితే కరోనా కాలానికి ముందు జరిగిన తీవ్రమైన రహదారి ప్రమాదంలో ఆయన వెన్నెముకకు గాయమై, టెన్నిస్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, ఆరోగ్యం మెరుగుపరుచుకున్న తర్వాత తన దృష్టిని మోడలింగ్ వైపు మళ్లించారు. పలు ప్రకటనల్లో నటించి గుర్తింపు సంపాదించారు. 'రుబారు' సంస్థ నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక మిస్టర్ ఇండియా పోటీలకు దేశవ్యాప్తంగా ఎంపికైన 18 మంది అభ్యర్థుల్లో ప్రధాన్ రాఘవ ఒకరు.

వివరాలు 

ముగ్గురిని మిస్టర్ యూనివర్స్' పోటీలకు..

మూడు నెలలపాటు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన వివిధ పరీక్షల్లో విజయం సాధించి ఈ అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఫైనలిస్టుల శిక్షణ కార్యక్రమాలు, పోటీలలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఎంపికయ్యే టాప్‌ ఎనిమిది సభ్యుల్లో తానూ ఉంటానని ప్రధాన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే జూన్, జూలై నెలల్లో ముంబయిలో జరిగే తుది దశ పోటీల్లో ముగ్గురిని ఎంపిక చేసి 'మిస్టర్ యూనివర్స్' పోటీలకు పంపనున్నారు. భవిష్యత్తులో మోడలింగ్,చిత్రరంగాల్లో మంచి స్థానం సంపాదించడమే తన లక్ష్యమని ప్రధాన్ తెలిపారు.

Advertisement