Prajwal Revanna: హెచ్‌డీ దేవెగౌడ వార్నింగ్.. రేపు భారత్‌కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ
కర్ణాటకలోని హాసన్ లోక్‌సభ స్థానానికి చెందిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. రేవణ్ణపై ఈ ఆరోపణలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అయన మే 27న జర్మనీకి పారిపోయాడు. సోర్సెస్ ప్రకారం, ప్రజ్వల్ రేవణ్ణ ఇప్పుడు ఇండియాకు తిరిగి వస్తున్నాడు. అయన మే 30న మ్యూనిచ్ నుండి బెంగుళూరుకు రిటర్న్ టిక్కెట్ తీసుకున్నాడు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమాచారం ప్రకారం, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ మే 31 ఉదయం బెంగళూరు చేరుకునే అవకాశం ఉంది.
ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సిట్
ఈ క్రమంలో కెంపేగౌడ విమానాశ్రయంలో సిట్ బృందాన్ని మోహరించారు. ప్రజ్వల్ రేవణ్ణపై ఇప్పటి వరకు రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసును విచారిస్తున్న సిట్ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. నిందితులిద్దరినీ నవీన్ గౌడ, చేతన్ గౌడగా గుర్తించారు. ప్రజ్వల్‌కు సంబంధించిన వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను పంపిణీ చేసినట్లు వారిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అసలు విషయం ఏమిటి?
మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ చాలా మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆయన హాసన్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్డీయే అభ్యర్థి. హాసన్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటు వేసిన ఒక రోజు తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ జర్మనీకి వెళ్లారు. ఆయనపై సీబీఐ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. ప్రజ్వల్ ఆచూకీని ఏజెన్సీ అధికారులు ఆరా తీస్తున్నారు. లైంగిక దోపిడీ, అత్యాచారం కేసులో హసన్ ఎంపీపై ప్రత్యేక కోర్టు మే 18న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ప్రజ్వల్ నివాసంలో సిట్ సోదాలు
రెండు రోజుల క్రితం హాసన్ ఎంపీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మే 31న సిట్ ఎదుట హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. హాసన్‌కు చెందిన ఎంపీ గతంలో రెండుసార్లు జర్మనీ నుంచి వచ్చే విమాన టిక్కెట్‌ను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రజ్వల్ నివాసంలో సిట్ సోదాలు నిర్వహించగా, అందులో కొన్ని అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.