Page Loader
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష భగ్నం.. బలవంతంగా ఎయిమ్స్‌కు తరలింపు 
ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష భగ్నం.. బలవంతంగా ఎయిమ్స్‌కు తరలింపు

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష భగ్నం.. బలవంతంగా ఎయిమ్స్‌కు తరలింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ రాజకీయ నేతగా మారి విద్యార్థులకు మద్దతుగా పట్నాలోని గాంధీ మైదానంలో గాంధీ విగ్రహం వద్ద జనవరి 2న దీక్షను ప్రారంభించారు. అయితే, సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయనను అదుపులోకి తీసుకొని ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. పోలీసులకు వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో బలవంతంగా అక్కడి నుంచి ఆయనను తరలించారు. దీక్షా స్థలి వద్ద వేదికను ఖాళీ చేయించడంతోపాటు, పార్టీ శ్రేణులు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో గాంధీ మైదానం వద్ద గందరగోళం ఏర్పడింది.

వివరాలు 

వివాదాస్పదమైన  లగ్జరీ వ్యానిటీ వ్యాన్ 

డిసెంబర్ 13న బీహార్‌లో నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. నిరసనల సమయంలో పోలీసుల లాఠీచార్జ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆందోళనకారులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ దీక్షకు దిగారు. ఇక, ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఖరీదైన లగ్జరీ వ్యానిటీ వ్యాన్ నిరసన ప్రాంతం సమీపంలో పార్క్ చేయడం వివాదాస్పదమైంది. కోట్ల విలువైన ఈ వాహనంలో కిచెన్, బెడ్ రూమ్, ఏసీ వంటి సౌకర్యాలు ఉండడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని వల్ల ప్రశాంత్ కిషోర్ లక్ష్యాలపై అనుమానాలు, విమర్శలు వచ్చాయి.