Prashant Kishor: కొత్త పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్.. 'జన్ సురాజ్ పార్టీ'గా నామకరణం
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజాగా తన కొత్త రాజకీయ పార్టీని బుధవారం అధికారికంగా ప్రకటించారు. 'జన్ సురాజ్ పార్టీ' (Jan Suraj Party) అనే పేరుతో నూతన పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీ గత రెండు సంవత్సరాలుగా క్రియాశీలంగా ఉందని, అలాగే ఎన్నికల సంఘం నుండి ఆమోదం పొందిందని పేర్కొన్నారు. తద్వారా బిహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని ఆయన తెలిపారు. కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించామని, కానీ ఈ పార్టీలో నాయకత్వం తన చేతుల్లో లేదన్నారు. గత రెండు సంవత్సరాలుగా దీని కోసం శ్రమించిన వారే ఈ పార్టీలో నిర్ణయాలను తీసుకుంటారని వెల్లడించారు.
బిహార్ విద్యా వ్యవస్థలో మార్పు రావాలి
బిహార్ ప్రజలు గత 30 ఏళ్లుగా ఆర్జేడీ, జేడీయూ లేదా బీజేపీ పార్టీలకు మాత్రమే ఓటు వేస్తున్నారని చెప్పారు. ఈ సంప్రదాయానికి ముగింపు పలికాలని, తమ పార్టీ రాజవంశానికి చెందినది కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్రీయ ఎన్నికల సంఘం జన్ సూరాజ్ పార్టీలను గుర్తించినట్లు తెలిపారు. బిహార్ విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పు కోసం రూ. 5 లక్షల కోట్ల అవసరమని, విద్యారంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించేందుకు రాబోయే పదేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయాలని పీకే పేర్కొన్నారు.