Page Loader
Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ.. ఈ ఏడాది నుంచే అందుబాటులోకి.. 
ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ.. ఈ ఏడాది నుంచే అందుబాటులోకి..

Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ.. ఈ ఏడాది నుంచే అందుబాటులోకి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పుడు నుంచి ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్) అందుబాటులోకి రానుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభ దశలో భాగంగా 210 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరగతుల్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. బుధవారం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీయ్యాయి. ఈ తరగతులను అందుబాటులోకి తీసుకురావడానికి హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ జిల్లాల్లో పాఠశాలల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

వివరాలు 

ప్రీ-ప్రైమరీ విద్య కేవలం ఒకే సంవత్సరం

పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభ తరగతిలో చేరే పిల్లలకు అవసరమైన మౌలిక పరిజ్ఞానాన్ని, సామాజిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఉంటుంది. ఆటలతో, పాటలతో, కథల రూపంలో బోధన చేపడతారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా నేర్చుకునే పరిసరాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను రెండు సంవత్సరాల పాటు ఎల్‌కేజీ, యూకేజీ రూపంలో నిర్వహిస్తారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఇది కేవలం ఒకే సంవత్సరంపాటు అందుబాటులో ఉండనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.