Telangana: వానాకాలం ధాన్యం మిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ దృష్టి.. ఉగాది నుంచి రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ!
ఈ వార్తాకథనం ఏంటి
వానాకాలంలో ధాన్యం సేకరణ పూర్తయిన తరువాత, పౌర సరఫరాల శాఖ దాని మిల్లింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఇప్పటివరకు రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతుండగా, త్వరలోనే ఆ స్థానంలో సన్నబియ్యం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఈ నేపథ్యంలో, ధాన్యం సేకరణ ప్రారంభమైనప్పటి నుంచే సన్న, దొడ్డు వడ్లను వేర్వేరుగా నిల్వ చేసి, మిల్లులకు తరలించడం, ఆపై కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సిద్ధం చేయడం జరుగుతోంది.
ఫిబ్రవరి తొలి వారానికి 4.59 లక్షల టన్నుల సన్నబియ్యం అందుబాటులోకి వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
వివరాలు
నెలకు 2.30 లక్షల టన్నుల అవసరం
రేషన్‌కార్డుదారులకు ఉగాది పండగ సందర్భంగా సన్నబియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల కోసం సన్నబియ్యం ఉపయోగిస్తున్నారు.
రేషన్‌కార్డుదారులు, విద్యార్థుల కోసం కలిపి నెలకు 2.30 లక్షల టన్నుల సన్నబియ్యం అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4.59 లక్షల టన్నులు రెండు నెలల సరిపోతాయని పేర్కొన్నారు.
ఇంకా పెద్ద ఎత్తున సన్న వడ్ల మిల్లింగ్ కొనసాగుతోంది. యాసంగి వడ్ల సేకరణ ఏప్రిల్ నుండి ప్రారంభంకానుంది.
అప్పటివరకు వానాకాలంలో సేకరించిన సన్న ధాన్యాన్ని సీఎంఆర్ రూపంలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
24 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
వానాకాలం పంటలో 4,48,939 మంది రైతుల నుండి పౌర సరఫరాల శాఖ 24లక్షల టన్నుల సన్న వడ్లను సేకరించింది.
సాధారణంగా 100టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు సుమారు 67టన్నుల సన్నబియ్యం వస్తుంది.
ఈ లెక్కన,మొత్తం 24 లక్షల టన్నుల వడ్ల నుండి 16.08 లక్షల టన్నుల బియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 89.98 లక్షల రేషన్ కార్డులు ఉండగా, మొత్తం 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు.
ప్రతి ఒక్కరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం సరఫరా చేయనున్నారు.
ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యాన్ని చాలా మంది నేరుగా అన్నం వండడానికి ఉపయోగించకుండా రీసైక్లింగ్‌కు తరలిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం, ఈ అక్రమాలను అరికట్టేందుకు రేషన్‌లో సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది.