Fish Prasadam: మృగశిర కార్తె 'చేప ప్రసాదం' కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం అత్యంత విశిష్టంగా నిర్వహించే 'మృగశిర కార్తె చేప ప్రసాదం' పంపిణీ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈసారి జూన్ 8న నాంపల్లి ప్రదర్శన మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేపట్టనున్నారు. ఈ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రియాంకతో పాటు బత్తిన కుటుంబ సభ్యులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండటంతో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
వివరాలు
ఈ చేప ప్రసాదాన్ని ఉచితంగా బత్తిన గౌడ్ కుటుంబం అందిస్తోంది
ప్రత్యేకంగా రహదారి రద్దీ నియంత్రణ, వాహనాల నిల్వ ఏర్పాట్లు, క్యూలైన్ల పర్యవేక్షణ, ప్రజల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దశాబ్దాలుగా బత్తిన గౌడ్ కుటుంబం ఈ చేప ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తోంది. ఉబ్బసం, ఇతర శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఉపశమనం కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ ప్రసాదంలో చిన్న జీవచేప నోటిలో ప్రత్యేక మూలికల మిశ్రమాన్ని ఉంచి రోగికి మింగిస్తారు. చేపను తీసుకోలేని వారికి బెల్లంతో తయారుచేసిన ప్రత్యేక మూలికల మిశ్రమాన్ని అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.