Andhra Pradesh: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌కు కసరత్తు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి నెలాఖరులోగా తమ బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. బడ్జెట్ ప్రతిపాదనల తయారీకి అనుసరించాల్సిన మార్గదర్శకాలను కూడా స్పష్టంగా సూచించింది. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాల సవరణ ప్రతిపాదనలను కూడా శాఖలు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ప్రతి ప్రభుత్వ హెడ్ కింద ఇప్పటివరకు ఎంతమొత్తం ఖర్చు చేశారో, ఎంతమేర ఆదా జరిగిందో ముందుగానే గుర్తించాలని సూచించింది.
Details
సవరణ ప్రతిపాదనలు పంపించాలి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వివిధ ఖాతాల కింద జరిగిన వ్యయ వివరాలతో పాటు, మిగిలిన మూడు నెలల్లో ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉందో స్పష్టమైన అంచనాలతో సవరణ ప్రతిపాదనలు పంపించాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం, రహదారులు, ఇతర రవాణా సౌకర్యాల అభివృద్ధి, రక్షిత తాగునీటి సరఫరా, విద్య, వైద్య రంగాల్లో ప్రమాణాల మెరుగుదలతో పాటు పారిశ్రామికీకరణ విస్తరణను దృష్టిలో ఉంచుకొని మూలధన బడ్జెట్ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
Details
హడ్కో సహకారంతో చేపడుతున్న పనుల వివరాలు
అలాగే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP), కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అమలవుతున్న కార్యక్రమాలు, నాబార్డ్, హడ్కో సహకారంతో చేపడుతున్న పనుల వివరాలను కూడా బడ్జెట్ ప్రతిపాదనల్లో సమగ్రంగా పొందుపరచాలని ఆర్థిక శాఖ ఆదేశించింది.