హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నగరంలో భారీ భద్రతా, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి ముర్ము చేరుకోనున్నారు. ఈ మేరకు నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రెసిడెెంట్ ఆఫ్ ఇండియాగా దేశ తొలి పౌరురాలు ముర్ము రాక సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రాకపోకలు సాగించే దారుల్లో పోలీసులు నిఘా పెంచారు.
హెలికాప్టర్ ద్వారా గచ్చిబౌలి స్టేడియానికి చేరుకోనున్న రాష్ట్రపతి
తొలుత హకీంపేట ఎయిర్ ఫోర్స్ కేంద్రంలో అడుగుపెట్టనున్న ముర్ము, అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరుతారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమానికి హజరవుతారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గచ్చిబౌలి స్టేడియం వైపు వాహనాల మళ్లిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్యాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.