పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్‌ప్రాక్టీస్ నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
Public examination bill: పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్‌ప్రాక్టీస్ నిరోధక బిల్లు, 2024కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇటీవల ముగిసిన బడ్జెట్ సెషన్‌లో పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదంతో ఇప్పుడు బిల్లు చట్టంగా మారింది. పబ్లిక్ పరీక్షలలో రిగ్గింగ్, అక్రమ మార్గాలను అనుసరించడాన్ని ఈ చట్టం నిరోధిస్తుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, నేషనల్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వ విభాగాలు నిర్వహించే పరీక్షలను సూచిస్తుంది.
నేరం రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష
ప్రశ్నపత్రం, సమాధానాలను లీక్ చేయడం, పరీక్ష సమయంలో అభ్యర్థులకు సహాయం చేయడం, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేయడం, నకిలీ పరీక్ష నిర్వహించడం, నకిలీ అడ్మిట్ కార్డులు జారీ చేయడం వంటి వాటిని ఈ చట్టం నిరోధిస్తుంది. పబ్లిక్ పరీక్షా విధానంలో పారదర్శకత, న్యాయబద్ధత, విశ్వసనీయతను పునరుద్ధరించడం, నిజాయితీగా కష్టపడే వారి ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందని, వారి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని యువతలో విశ్వాసాన్ని నింపడం కోసం కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద నేరం రుజువైతే 3-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.