Goa Nightclub Fire: గోవా నైట్‌క్లబ్ విషాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఈ వార్తాకథనం ఏంటి
గోవాలోని నైట్‌క్లబ్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం (Goa Nightclub Fire)పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనపై ఇద్దరూ 'ఎక్స్'లో స్పందించారు. ఈ అగ్నిప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడం ఎంతో బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో మాట్లాడినట్లు మోదీ వెల్లడించారు.
Details
50 మంది గాయపడినట్లు సమాచారం
బాధితుల కోసం అవసరమైన అన్ని సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. మోదీతో తాను మాట్లాడిన విషయాన్ని సీఎం సావంత్ ధృవీకరించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ప్రధానికి వివరించామని, బాధిత కుటుంబాలకు గోవా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఉత్తర గోవాలోని అర్పోరా ప్రాంతంలోని రోమియో లేన్‌లో ఉన్న ప్రముఖ నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 25 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరొక 50 మంది గాయపడినట్లు సమాచారం. మృతులలో నలుగురు పర్యాటకులు ఉండగా, 19 మంది క్లబ్ సిబ్బందిగా ప్రాధమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Details
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
సిలిండర్ పేలుడు ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాత్రంతా రక్షణ చర్యలు కొనసాగాయి. బాధితులను గుర్తించి వారి కుటుంబాలకు సమాచారం చేరవేయడానికి అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రమాదం అనంతరం క్లబ్‌ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిర్వాహకులను ప్రశ్నిస్తూ, ప్రమాదానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. క్లబ్‌లో భద్రతా ప్రమాణాలు పాటించారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు.