President Award: ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి అవార్డు
ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ల గ్రామ పంచాయతీ రాష్ట్రపతి అవార్డును దక్కించుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న గ్రామ పెద్దలు, అనంతరం ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నందిగామ నియోజకవర్గం చంద్రళ్లపాడు మండలానికి చెందిన ముప్పాళ్ల గ్రామ సర్పంచ్ కుసుమ రాజు వీరమ్మ, ఉప సర్పంచ్ నల్ల రవి, పంచాయతీ కార్యదర్శి సాయిరాం ఈ అవార్డును స్వీకరించారు. ముప్పాళ్ల గ్రామం జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం, సోషల్ సెక్యూరిటీ విభాగాల్లో ఉత్తమ పంచాయతీగా ఎంపికై ఈ గౌరవాన్ని పొందింది. అలాగే అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి, తగరంపూడి పంచాయతీలు కూడా జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను అందుకున్నాయి.
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు
ఈ సందర్భంగా సర్పంచ్ కుసుమ రాజు వీరమ్మ మాట్లాడుతూ, గ్రామానికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు లభించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. తమ గ్రామాన్ని ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముప్పాళ్ల పంచాయతీ ఎంపిక కావడం ఆనందకరమని చెప్పారు. ఈ నెల 11వ తేదీన కోటి రూపాయల నగదు పంచాయతీ ఖాతాలో జమైందని, ఆ మొత్తాన్ని గ్రామ అవసరాలకు వినియోగించి మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు.