Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొంటూ, బాధిత కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తక్షణ సాయంగా ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.
Details
తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ.5లక్షలు
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాల ప్రకారం — మృతి చెందిన ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, అదనంగా ఆర్టీసీ తరఫున రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనుంది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన 11 మందిని అధికారులు గుర్తించారు. వారిలో ఏనుగుల కల్పన, బి. నాగమణి, హనుమంతు, గుర్రాల అబిత, గోసల గుణమ్మ, షేక్ ఖలీద్ జహంగీర్ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తనుషా, సాయిప్రియ, నందిని అనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులంతా తాండూరులోని వడ్డెర గల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.