
Andhra News: ఏపీ దొనకొండ దగ్గర క్షిపణుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్న బీడీఎల్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్‌కి రాబోతోంది. రూ.1,200 కోట్ల భారీ పెట్టుబడితో సమీకృత ఆయుధ వ్యవస్థలు, ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్‌ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1,400 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవలే ప్రతిపాదించింది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నట్లు బీడీఎల్ అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతంలోని భూములను బీడీఎల్ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. భారత సాయుధ దళాలకు అవసరమైన మిసైళ్లు, ఇతర రక్షణ ఆయుధాలను డీఆర్‌డీవో (DRDO) సహకారంతో తయారు చేయాలన్న ప్రణాళికతో ఈ సంస్థ ముందుకు సాగుతోంది.
వివరాలు
మడకశిరలో అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ యూనిట్
దీనికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR)ను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది. ఇకపోతే, భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కల్యాణి స్ట్రాటజీస్ సిస్టమ్స్ లిమిటెడ్, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో రూ.2,400 కోట్లతో అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తోంది. ఈ రెండు సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే, రక్షణ పరికరాల తయారీ, పరిశోధన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
యూనిట్ ప్రత్యేకతలు
బీడీఎల్ ప్రతిపాదించిన ఈ యూనిట్ ప్రత్యేకతలలో ప్రధానంగా సెన్సర్లు, కమ్యూనికేషన్ పరికరాలు, క్షిపణులు, తుపాకులు వంటి ఆయుధ వ్యవస్థల సమన్వయానికి అవసరమైన ఇంజినీరింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈ యూనిట్ ద్వారా అన్ని విభాగాల సమన్వయంతో పనిచేసే సమీకృత వ్యవస్థలు (Integrated Systems) అభివృద్ధి చేయబడతాయి. ఇక అంతరిక్ష ప్రయోగాలు,సైన్య అవసరాలకు అనుగుణంగా,వెయ్యి టన్నుల వరకు పేలోడ్‌లను మోయగల రాకెట్ మోటార్‌లను ఈ యూనిట్‌లో తయారుచేయనుంది. బీడీఎల్ అందించిన డీపీఆర్ ప్రకారం,2026 మార్చి నాటికి అన్ని అవసరమైన అనుమతులు పూర్తవుతాయని,వెంటనే నిర్మాణ కార్యక్రమం ప్రారంభించి 2028 మార్చి నాటికి పూర్తి చేయాలని,ఆ తర్వాత జూన్‌లో యంత్రాలను అమర్చే పనులు పూర్తి చేసి, సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలన్న ప్రణాళిక రూపొందించారు.
వివరాలు
మౌలిక సదుపాయాల ప్రతిపాదనలు
యూనిట్ స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాల కింద, బీడీఎల్ పలు ప్రతిపాదనలు చేసింది. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నుండి సుమారు 8 కి.మీ. పొడవైన రెండు లేన్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం. రోజుకు 25 వేల కిలోవాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు. రోజుకు 2 వేల కిలోలీటర్ల నీటి సరఫరా కోసం సదుపాయాల ఏర్పాట్లు. ఈ మౌలిక సదుపాయాల వల్ల యూనిట్ నిరంతర ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగించగలదని బీడీఎల్ పేర్కొంది.
వివరాలు
పెట్టుబడుల దశలు
బీడీఎల్ యూనిట్ నిర్మాణం రెండు దశల్లో పూర్తవుతుంది. మొదటి దశలో రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టి ప్రాథమిక మౌలిక సదుపాయాలు నిర్మించనుంది. రెండో దశలో మరో రూ.550 కోట్లతో యూనిట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనుంది. ఈ యూనిట్ ద్వారా వెయ్యి టన్నుల సామర్థ్యం గల ప్రొపెల్లెంట్ మోటార్లు, 130 సమీకృత ఆయుధ వ్యవస్థల యూనిట్లు ఉత్పత్తి చేయనున్నారు. మొత్తం 1,200 ఎకరాల్లో ఆయుధ తయారీ, పరీక్షా సదుపాయాలు ఏర్పాటు చేసి, మిగిలిన 200 ఎకరాల్లో ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం ఆధునిక టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలని ప్రణాళిక ఉంది.
వివరాలు
భూమి కేటాయింపు వివరాలు
ఈ ప్రతిపాదనల ప్రకారం, బీడీఎల్‌కు మొత్తం 1,346.67 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ప్రభుత్వ అధీనంలోని 317 ఎకరాలను ఎకరాకు రూ.7.73 లక్షల చొప్పున కేటాయించాలన్న నిర్ణయం, మిగిలిన భూములను ప్రైవేటు సేకరణ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రణాళిక ఉంది. ఈ ప్రాజెక్టు అమలు అయితే, ఆంధ్రప్రదేశ్ రక్షణ ఉత్పత్తి రంగంలో దేశవ్యాప్తంగా కీలక స్థానాన్ని సంపాదించనుందని, సాంకేతిక, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.