Andhra Pradesh New Railway Lines: ఏపీలో మూడు కొత్త రైల్వే లైన్లకు ప్రతిపాదనలు.. శ్రీశైలానికి నేరుగా రైలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్రంలో మూడు ముఖ్యమైన కొత్త రైల్వే మార్గాల నిర్మాణానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. మార్కాపురం-శ్రీశైలం-సికింద్రాబాద్, రాజంపేట-నెల్లూరు, సామర్లకోట-చింతూరు మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. ఈ మేరకు రైల్వే శాఖకు లేఖలు రాసింది. రైల్వే బోర్డు ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్), సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి అధికారులు సిద్ధంగా ఉన్నారు.
వివరాలు
గిరిజన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ
సామర్లకోట నుంచి జగ్గంపేట, రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా చింతూరు వరకు సుమారు 150 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ప్రతిపాదించారు.
ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఇప్పటివరకు రైలు సౌకర్యం లేని ఏజెన్సీ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడుతుంది.
ఇప్పటికే ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి చింతూరు మీదుగా తెలంగాణలోని భద్రాచలం వరకు 173 కిలోమీటర్ల రైల్వే లైన్‌కు ఆమోదం లభించింది.
ఈ రెండు మార్గాలు అనుసంధానమైతే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి.
ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి కాకినాడ పోర్టుకు బొగ్గు, ఇనుప ఖనిజం రవాణా మరింత సులభతరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
శ్రీశైలానికి ప్రత్యక్ష రైలు మార్గం
మరో కీలక ప్రతిపాదన మార్కాపురం నుంచి శ్రీశైలం మీదుగా సికింద్రాబాద్ వరకు సుమారు 290 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించడం.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి ప్రస్తుతం నేరుగా రైలు సౌకర్యం లేదు.
ఈ మార్గం అందుబాటులోకి వస్తే తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్ మీదుగా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి మార్కాపురం మీదుగా భక్తులు రైలులో నేరుగా శ్రీశైలం చేరుకోవచ్చు.
దీంతో పర్యాటక, వాణిజ్య రంగాలకు కూడా ప్రయోజనం కలగనుంది.
వివరాలు
కోస్తా, రాయలసీమ మధ్య తగ్గనున్న దూరం
రాజంపేట నుంచి నెల్లూరు వరకు సుమారు 120 కిలోమీటర్ల మేర మరో కొత్త రైల్వే మార్గాన్ని ప్రతిపాదించారు.
ప్రస్తుతం రాజంపేట నుంచి నెల్లూరు వెళ్లాలంటే రేణిగుంట మీదుగా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది.
కొత్త లైన్ నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు సరకు రవాణా కూడా సులభతరం కానుంది.
ఈ మూడు రైల్వే లైన్ల ప్రతిపాదనలు ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉన్నాయి.
వీటికి అనుమతులు లభించి, నిధులు మంజూరైతే ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే రవాణా రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.