Telangana: వైద్య కళాశాలల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా తాత్కాలిక మెరిట్ జాబితాను వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి మంగళవారం ప్రకటించింది. ప్రతి ఉద్యోగానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22, 23 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లోని వెంగళ్‌రావు నగర్ ప్రాంతంలో ఉన్న భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థ ప్రాంగణంలో ఈ ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది. నిర్ణయించిన తేదీల్లో హాజరుకాలేని అభ్యర్థులు ఈ నెల 25న తమ ధ్రువపత్రాలను సమర్పించవచ్చని స్పష్టం చేసింది.
వివరాలు
174 ఉద్యోగాల భర్తీ పూర్తయిందన్నమండలి
ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 34 విభాగాల్లో మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి గత ఏడాది నియామక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే 174 ఉద్యోగాల భర్తీ పూర్తయ్యిందని మండలి వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తైన తర్వాత తుది ఎంపికైన వైద్యుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపింది.