Page Loader
Punjab Bandh: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు.. నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు..
నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు..

Punjab Bandh: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు.. నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2024
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఖనౌరీ సరిహద్దులో గత 34 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్‌కు మద్దతుగా పంజాబ్ రైతులు డిసెంబర్ 30న పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు కొనసాగుతుందని, అందుకు ప్రజలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో రాష్ట్రంలో పాలు, కూరగాయలు వంటి నిత్యవసర వస్తువుల సరఫరాను నిలిపివేస్తామని, రహదారులపై వాహనాలు మరియు రైళ్లను కూడా ఆపివేస్తామని స్పష్టంచేశారు. రైతుల ఈ బంద్‌కు వాణిజ్య సంస్థలు కూడా మద్దతు ప్రకటించాయి.

వివరాలు 

వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, వివిధ వర్గాల నుండి మద్దతు

ఇక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా బంద్‌కు మద్దతుగా మూసివేయాలని రైతు సంఘాల నాయకులు కోరారు. అయితే, అంబులెన్స్‌లు, పెళ్లి వాహనాలు, అత్యవసర పరిస్థితుల్లో రాకపోకల వారికి మాత్రం అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) కిసాన్ మజ్దూర్ మోర్చా గత వారం నిర్ణయం తీసుకున్నాయి. దీనికి వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, వివిధ వర్గాల నుండి మద్దతు లభించిందని ప్రకటించారు.

వివరాలు 

మహాపంచాయత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన

రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధరలు అందించాలని డిమాండ్ చేస్తూ, 101 మంది రైతులు పంజాబ్-ఢిల్లీ సరిహద్దుల్లో శంభు సరిహద్దు వద్ద గత కొన్ని నెలలుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయడానికి వారు పలుమార్లు ప్రయత్నించారు, కానీ భద్రతా దళాలు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 4న ఖనౌరీ నిరసన ప్రదేశంలో కిసాన్ మహాపంచాయత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టాలని రైతులు నిర్ణయించారు.