పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుమార్తెకు ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులు
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కుమార్తె సీరత్ కౌర్‌ను ఖలిస్థానీ అనుకూల శక్తులు బెదిరించారు. భగవంత్ మాన్ కుమార్తెకు భద్రత కల్పించాలని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అమెరికాలో నివసిస్తున్న భగవంత్ మాన్ కుమార్తె సీరత్ కౌర్ మాన్‌ను ఖలీసాన్ అనుకూలవాదులు దుర్భాషలాడినట్లు పాటియాలాకు చెందిన న్యాయవాది పేర్కొన్నారు. ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్, అతని సహచరులపై పంజాబ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో విదేశాలలో ఖలిస్థానీ మద్దతుదారులు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీరత్ కౌర్‌కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.
భగవంత్ మాన్ మొదటి భార్య కుమార్తె సీరత్
12రోజులకు పైగా పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఆపరేషన్ ప్రారంభించారు. అమెరికాలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పిల్లలను ఘెరావ్ చేయడానికి, వేధించడానికి ప్లాన్ చేస్తున్నాయని న్యాయవాది హర్మీత్ బ్రార్ ఫేస్‌బుక్ పోస్ట్ చేశారు. పిల్లలను బెదిరించి, దుర్భాషలాడితే ఖలిస్తాన్ వస్తుందా? అని లాయర్ ప్రశ్నించారు. అయితే బెదిరింపులపై సీఎం కుమార్తె సీరత్ కౌర్ స్పందించారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. భగవంత్ మాన్ మొదటి భార్య ఇంద్రప్రీత్ కౌర్ గ్రేవాల్ కుమార్తె సీరత్ కౌర్. 2015లో భగవంత్-ఇంద్రప్రీత్ విడిపోయారు. గతేడాది డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను మాన్ వివాహం చేసుకున్నాడు. మాన్ కుమార్తె సీరత్, ఆమె సోదరుడు దిల్షన్, తల్లి ఇంద్రప్రీత్ ప్రస్తుతం అమెరికాలోని సియాటిల్‌లో నివసిస్తున్నారు.