ఏపీ అప్పులు ఎప్పటికీ తీర్చలేం.. ఆర్ధికస్ధితిపై కేంద్రాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ కోరిన పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంగళవారం దిల్లీలో కలిసి వినతి పత్రం అందించారు. ఏపీ అప్పు రూ.4.42 లక్షల కోట్లుగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా తయారైందని పురందేశ్వరి లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్ధిక అంశాలపై పురందేశ్వరి వినతిపత్రం అందజేశారు. ఆర్ధిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ బీజేపీ చీఫ్ అన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని అభ్యర్థించారు.
మద్యం ద్వారా ఏడాదికి రూ.30 వేల కోట్ల ఆదాయం లెక్కలోకి రావట్లేదు : పురందేశ్వరి
పార్లమెంట్‌లో కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకున్న వైసీపీ, బీజేపీ పేరును దెబ్బతీసేలా ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పోరేషన్ల రుణాలు, గ్యారంటీలను పరిగణనలోకి తీసుకుంటూ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్నారు. గత 4 ఏళ్లుగా ఏపీలో బడ్జెట్, అకౌంటింగ్ విధానం దెబ్బతిందని పురందేశ్వరి ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో మద్యం ద్వారా ఏడాదికి రూ.30 వేల కోట్ల ఆదాయం లెక్కలోకి రావట్లేదని నిర్మలకు వివరించారు. ఇదే సమయంలో పురందేశ్వరిపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు మంగళవారం చిత్తూరు జిల్లాలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దగ్గుబాటి పురందేశ్వరిని ఆయన కోవర్టుగా అభివర్ణించారు. బీజేపీలో చంద్రబాబు కోసం ఆమె పనిచేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.