R G Kar impasse: అసంపూర్తిగా ముగిసిన వైద్యుల రెండో విడత చర్చలు.. సమ్మె కొనసాగిస్తామన్నవైద్యాధికారులు
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో వైద్యుల రెండో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల భద్రతకు సంబంధించి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని, పనిని నిలిపివేస్తామని వైద్యులు సమావేశం అనంతరం ప్రకటించారు. ఈ చర్చలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ప్రజారోగ్య టాస్క్‌ఫోర్స్, 30 మంది జూనియర్ డాక్టర్ల ప్రతినిధుల మధ్య నబన్నాలోని రాష్ట్ర సచివాలయంలో జరిగాయి. చర్చలు దాదాపు ఆరు గంటలు కొనసాగాయి. చర్చలు సజావుగా సాగినా,ప్రభుత్వం చర్చించిన అంశాలపై సంతకాలు చేయడానికి లేదా లిఖితపూర్వకంగా మినిట్స్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ వ్యవహారంపై డాక్టర్ అనికేత్ మహ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, 'ప్రభుత్వ వైఖరి నిరాశకరం' అని వ్యాఖ్యానించారు.
ఎన్ఎస్ నిగమ్‌పై విచారణ చేపట్టాలన్న వైద్యుల డిమాండు తిరస్కరణ
వైద్యులు తమ డిమాండ్లను ఈమెయిల్ ద్వారా పంపుతామని, దాని ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అయితే, ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం,హత్యపై ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్‌పై విచారణ చేపట్టాలన్న వైద్యుల డిమాండును ప్రభుత్వం తిరస్కరించింది. సోమవారం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తొలి రౌండ్ చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రతకు సంబంధించిన అంశాలు,టాస్క్ ఫోర్స్ విధివిధానాలు చర్చించారు. వైద్యులు రోగులకు పడకల కేటాయింపు, హెల్త్ కేర్ వర్కర్ల నియామకం, ఇతర సమస్యలు కూడా లేవనెత్తారు. వైద్యుల ప్రతినిధులు,కళాశాల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుతో పాటు విద్యార్థుల ప్రాతినిధ్యం గురించి చర్చించారు. ఆర్‌జి కర్ ఆసుపత్రి ఘటన పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో వారు తమ డిమాండ్లను వెల్లడించారు.
రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై సమగ్ర విచారణ
రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై సమగ్ర విచారణ అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. భద్రతపై రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ 4-5 మంది ప్రతినిధులను పంపాలని ప్రభుత్వం కోరగా, వైద్యులు విస్తృత ప్రాతినిధ్యాన్ని కోరారు. రాత్రి గస్తీ కోసం మహిళా పోలీసు అధికారులను నియమించడానికి, పానిక్ బటన్లు, హెల్ప్‌లైన్స్ ఏర్పాటు చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. చివరగా, బుధవారం జరిగిన సమావేశం అనంతరం వైద్యులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ధర్నా కొనసాగుతుందని తెలిపారు.