UP Raebareli: రాయ్‌బరేలీ ఆసుపత్రిలో దారుణం.. రోగిని 35 సెకన్లలో 10 సార్లు తన్నిన స్వీపర్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిపై అక్కడ విధులు నిర్వహిస్తున్న పింకీ అనే మహిళా శానిటరీ ఉద్యోగిని దురుసుగా ప్రవర్తించింది. రోగిని బూతులు తిడుతూ, కాళ్లతో విచక్షణారహితంగా తన్నిన ఘటన అక్కడి సీసీటీవీ, వీడియోల్లో నమోదైంది. కేవలం 35 సెకన్ల వ్యవధిలోనే ఆమె రోగిని దాదాపు 10 సార్లు కాళ్లతో తన్నిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది ప్రవర్తనపై మరోసారి చర్చ మొదలైంది.
వివరాలు
మహిళా ఉద్యోగిని సస్పెండ్
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు ఆసుపత్రి యాజమాన్యం సంబంధిత మహిళా ఉద్యోగిని పింకీని తక్షణమే సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి-1956తో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సేవకుల (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనలు-1999 ప్రకారం ఆమెపై క్రమశిక్షణ చర్యలను ప్రారంభించారు. సస్పెన్షన్ కాలంలో ఆమెను ఆసుపత్రిలోని ఆయుష్ అవుట్‌పేషెంట్ విభాగానికి అటాచ్ చేశారు.
వివరాలు
సమగ్ర విచారణకు కమిటీ
ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిర్ణీత గడువులో నివేదిక సమర్పించేందుకు ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పుష్పేంద్ర కుమార్ ముగ్గురుసభ్యులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈకమిటీలో ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ డాక్టర్ దినేష్ ప్రతాప్ సరోజ్,మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ రిచా,సిస్టర్ మేట్రన్ సుష్మా యాదవ్ సభ్యులుగా ఉన్నారు. ఇదిలాఉండగా,ఈ ఘటనను రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ కుమార్ ఘోష్ కూడా తీవ్రంగా పరిగణించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల చీఫ్ మెడికల్ ఆఫీసర్లకు కీలకఆదేశాలు జారీ చేస్తూ, ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల అమానుషంగా లేదా దురుసుగా ప్రవర్తించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.