LOADING...
Raghav Chadha: ఆప్‌లో అంతర్గత విభేదాలు? రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దా తొలగింపు
ఆప్‌లో అంతర్గత విభేదాలు? రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దా తొలగింపు

Raghav Chadha: ఆప్‌లో అంతర్గత విభేదాలు? రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దా తొలగింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2026
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

సామాన్య ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో బలంగా వినిపిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల కీలక పరిణామాన్ని ఎదుర్కొన్నారు. సెల్‌ఫోన్ రీచార్జ్ ఛార్జీల పెంపు పేరుతో ప్రైవేటు టెలికం కంపెనీలు చేస్తున్న దోపిడీపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. మొబైల్ డేటా వినియోగ విధానాలపై కూడా టెలికం సంస్థల తీరును ఆయన సభలో తీవ్రంగా విమర్శించారు. అదేవిధంగా మహానగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలతో పాటు బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాన్ని కూడా రాజ్యసభలో ప్రస్తావించారు. ఇలాంటి ప్రజా సమస్యలపై చురుకుగా స్పందిస్తున్నప్పటికీ,ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది.

వివరాలు 

కారణం ఏమిటి?

రాజ్యసభలో ఉపనేత పదవి నుంచి చద్దాను తప్పించి,ఆయన స్థానంలో పంజాబ్‌కు చెందిన ఎంపీ అశోక్ మిట్టల్ ను నియమించింది. ఈ నిర్ణయంపై పార్టీ వర్గాలు రాజ్యసభ సచివాలయానికి అధికారిక సమాచారం పంపినట్లు తెలిపాయి. 2023 నుంచి చద్దా ఆప్ ఉపనేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. రాఘవ్ చద్దా పదవి కోల్పోవడానికి ఆయన వైఖరే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనే అభిప్రాయం ఆయనపై వ్యక్తమవుతోంది. ముఖ్యమైన అంశాలపై స్పందించకపోవడం, మౌనం పాటించడం పార్టీ అధిష్టానానికి అసంతృప్తి కలిగించినట్లు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మరియు మనీష్ సిసోడియా ను కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత కూడా చద్దా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.

వివరాలు 

కీలక పార్టీ సమావేశాలకు పలుమార్లు గైర్హాజరు

సోషల్ మీడియాలో కూడా ఆయన ఎటువంటి వ్యాఖ్య చేయకపోవడం పార్టీలో అసంతృప్తికి దారితీసింది. పార్టీ అగ్రనేతలకు ఊరట లభించిన సందర్భంలో కూడా చద్దా స్పందించకపోవడం ఆయనపై విమర్శలకు కారణమైంది. అంతేకాకుండా, కీలక పార్టీ సమావేశాలకు కూడా పలుమార్లు గైర్హాజరు కావడం గమనార్హం. ఇదే తరహా విమర్శలు గతంలో కూడా ఎదుర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టైనప్పుడు ఆలస్యంగా స్పందించిన విషయాన్ని అప్పట్లో బ్రిటన్‌లో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నందునే ఆలస్యం జరిగిందని వివరణ ఇచ్చారు.

Advertisement

వివరాలు 

కేజ్రీవాల్‌కు సన్నిహితుడిగా ఎదిగిన నేత

37 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ రాఘవ్ చద్దా, 2012లో ఆప్ స్థాపన నుంచి పార్టీతోనే కొనసాగుతున్నారు. ఒక సమయంలో కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన, పార్టీ జాతీయ కోశాధికారిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కీలక నిర్ణయాల్లో భాగమయ్యారు. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ సమన్వయంలో కూడా ఆయన పాత్ర ముఖ్యమైంది. ఢిల్లీలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. అలాగే ఢిల్లీ జల్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు సలహాదారుడిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కో-ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement