యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు
గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నానని, అయితే కొన్ని పరిణామాల వల్ల మనసు మార్చుకున్నానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఒక్క మాట అనడం వల్లే రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడానికి మనసు ఒప్పుకోలేదన్నారు. అందుకే మళ్లీ ప్రజల ముందుకు వచ్చినట్లు చెప్పారు. తన స్వగ్రామం నీలకంఠాపురంలో గుడి కట్టేందుకు నాలుగేళ్లుగా రాజకీయాలకు విరామం ఇచ్చానని రఘువీరా తెలిపారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం: రఘువీరా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా పని చేస్తామన్నారు. బెంగళూరు నగర ఎన్నికల పరిశీలకుడిగా తనను కాంగ్రెస్ పార్టీ నియమించిందని తెలిపారు. రాహుల్‌ను అవమానించినందుకు కర్ణాటక ప్రజలు బీజేపీని గద్దె దించుతారని అన్నారు. తన అభిమానులు చెప్పినట్లే భవిష్యత్‌లో తన రాజకీయ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. రఘువీరా రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. మడకశిర నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.