
Rahul Gandhi: హిందూ మతంలో రాహుల్ గాంధీకి చోటు లేదు : శంకరాచార్య
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శ్రీరాముడిపై చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఒక కీలక ప్రకటన చేశారు.
రాహుల్ గాంధీ ఇకపై హిందూ మతంలో భాగం కాదని, అతనిని హిందూ మతం నుంచి బహిష్కరిస్తామని స్వామి ప్రకటించారు.
బద్రీనాథ్‌లోని శంకరాచార్య ఆశ్రమంలో మాట్లాడిన అవిముక్తేశ్వరానంద, రాహుల్ గాంధీ నిరంతరం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
మనుస్మృతిపై రాహుల్ గాంధీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు సనాతన ధర్మ విశ్వాసులను తీవ్రంగా బాధించాయన్నారు.
Details
రాహుల్ గాంధీకి నోటీసులు
మనుస్మృతిలో అత్యాచార నిందితులను రక్షించే సూత్రం ఉందనే వ్యాఖ్యను రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో చేసినట్లు ఆయన గుర్తు చేశారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మూడు నెలల క్రితమే రాహుల్ గాంధీకి నోటీసు పంపినట్లు శంకరాచార్య తెలిపారు. మనుస్మృతిలో ఏమి ఉందో స్పష్టంగా చెప్పాలని కోరినా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు.
ఒక వ్యక్తి హిందూ ధర్మ గ్రంథాలను నిరంతరం అవమానిస్తూ, సమాధానం ఇవ్వకుండా ఉంటే అతనికి హిందూ మతంలో స్థానం లేదన్నారు. హిందువు అని చెప్పుకునే అర్హత రాహుల్ గాంధీకి లేదని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి.
Details
దేశంలోని ప్రతి ఊర్లోనూ రామాలయం ఉంది
మరోవైపు భారతీయులు అత్యంత భక్తితో పూజించే దేవుడు శ్రీరాముడు. దేశంలోని ప్రతీ ఊర్లోనూ రామాలయం కనిపించదగిన స్థితి ఉంది.
అలాంటి రాముడిపై కాంగ్రెస్ నేతలు తాము ఇష్టమైనట్లు మాట్లాడుతుండడం భక్తులను కలతపెడుతోందన్నారు. తాజాగా అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మళ్లీ వివాదాస్పదమయ్యాయి.
శ్రీరాముడు సహా భారతీయ దేవుళ్లను పురాణ రూపాలు మాత్రమేనని వ్యాఖ్యానించడంతో భక్తుల్లో ఆవేదన నెలకొంది.
ఈ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ మరోసారి హిందూ మతాన్ని వివాదంలోకి లాగారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.