మణిపూర్ కంటే ఇజ్రాయెల్‌పై ప్రధాని మోదీకి ఎక్కువ ఆసక్తి: రాహుల్ గాంధీ
మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ కంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనే ప్రధాని ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. మిజోరంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఇజ్రాయెల్‌లో ఏమి జరుగుతుందనే దానిపై ప్రధానమంత్రి,భారత ప్రభుత్వానికి చాలా ఆసక్తి ఉంది, కానీ మణిపూర్‌లో ఏమి జరుగుతుందో దానిపై అస్సలు ఆసక్తి చూపకపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జూన్‌లో మణిపూర్ పర్యటనను కూడా ప్రస్తావించారు.భారతీయ జనతా పార్టీ (బిజెపి) మణిపూర్ ను నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఐజ్వాల్‌లో రాహుల్ పాదయాత్ర
ప్రజలు హత్యకు గురయ్యారు, మహిళలు వేధింపులకు గురయ్యారు, పసికందులను చంపారు, కానీ ప్రధాని మాత్రం ఇక్కడికి రావడం ముఖ్యం అనుకోవట్లేదని రాహుల్ గాంధీ అన్నారు. మేలో రెండు వర్గాల మధ్య హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించకపోవడం సిగ్గుపడాల్సిన విషయమని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ సోమవారం ఐజ్వాల్‌లో చన్మరి జంక్షన్ నుంచి రాజ్‌భవన్ వరకు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మిజోరంలో ఉన్నారు.40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి.